మరో 8 మెడికల్‌ కాలేజీలు | Another 8 medical colleges In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరో 8 మెడికల్‌ కాలేజీలు

Published Mon, Mar 2 2020 4:07 AM | Last Updated on Mon, Mar 2 2020 8:20 AM

Another 8 medical colleges In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే 7 నూతన మెడికల్‌ కాలేజీలకు డీపీఆర్‌లు సిద్ధం కావడం, శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతుండటం తెలిసిందే. అయితే ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఒక ప్రభుత్వ వైద్యకళాశాల, అనుబంధంగా బోధనాసుపత్రి ఉండాలనే లక్ష్యంతో మరో 8 వైద్య కళాశాలల ఏర్పాటు కోసం భూసేకరణ జరుగుతోంది.  

9 నెలల్లో 15 మెడికల్‌ కాలేజీలు! 
రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్‌ నియోజక వర్గాలుండగా ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్యకళాశాలలు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 7 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి గతంలోనే అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా మరో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో తొమ్మిది నెలల వ్యవధిలోనే 15 కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లైంది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైద్య కాలేజీల సంఖ్య 26కి చేరనుంది. 8 నూతన వైద్య కళాశాలలకు భూమి సమకూర్చే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2014–19 మధ్య రాష్ట్రంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాకపోవడంతో బోధనాసుపత్రులకు రోగుల తాకిడి తీవ్రంగా పెరిగింది. 
 
ఆస్పత్రులను ఉన్నతీకరించి కొత్తవి ఏర్పాటు 
కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటయ్యే చోట ప్రస్తుతం ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వీటిని 500 పడకల ఆస్పత్రుల స్థాయికి మార్చి ఉన్నతీకరిస్తారు. ఒక్కో వైద్య కళాశాలకు కనీసం 40 – 50 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రోజుకు 1,000 – 1,500 మంది ఔట్‌పేషెంట్లు వచ్చినా ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందేలా చర్యలు చేపడుతున్నారు. ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ వార్డులు తదితరాలు ఏర్పాటవుతాయి. ఒక్కో కళాశాలకు కనీసం 100 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యేలా అధ్యాపకులు, మౌలిక వసతులను కల్పిస్తారు.  
 
ఇప్పటికే 7 వైద్య కళాశాలలకు అనుమతులు
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే రాష్ట్రంలో కొత్తగా 7 ప్రభుత్వ వైద్యకళాశాలలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి ఇప్పటికే అనుమతులు కూడా మంజూరు చేసింది. గిరిజన ప్రాంతమైన పాడేరుతో పాటు పులివెందుల, గురజాల, మార్కాపురం, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరులో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. గురజాల, మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. మార్కాపురం పరిసరాల్లో కిడ్నీ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది.  ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు పీఎంఎస్‌ఎస్‌వై (ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన) కింద సాయం అందించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కళాశాల ఏర్పాటు వ్యయంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చు భరిస్తాయి. 

 ఎక్కువ జిల్లాలతో తమిళనాడుకు లబ్ధి
తమిళనాడులో ఎక్కువగా జిల్లాలు ఉండటంతో ఆ రాష్ట్రానికి భారీగా లబ్ధి చేకూరింది. తమిళనాడులో 22 ప్రభుత్వ వైద్యకళాశాలలుండగా మన రాష్ట్రంలో 11 మాత్రమే ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో పద్మావతి మెడికల్‌ కాలేజీ కొనసాగుతోంది. మన రాష్ట్రం విస్తీర్ణం 160,205 చదరపు కిలోమీటర్లు ఉండగా, తమిళనాడు 130,060 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement