ప్రతిపాదనలతో రావాలని వీసీలకు ఉన్నతవిద్యామండలి సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య కొత్తపుంతలు తొక్కనుంది. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పరిధిలో 25 విశ్వవిద్యాలయాలు ఉండగా.. రానున్న మూడేళ్లలో కొత్తగా మరో తొమ్మిది యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) కింద ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఉన్నతవిద్యా మండలి విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో శుక్రవారం రెండోసారి సమావేశం నిర్వహించింది.
రూసా పథకంలో భాగంగా రానున్న మూడేళ్లలో రాష్ట్రానికి రూ. 1,000 నుంచి రూ. 1,500 కోట్లు మంజూరుకానున్నాయని విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. వీటి సద్వినియోగానికి తగిన ప్రణాళికలతో ఈనెల 21నాటి సమావేశానికి రావాలని వీసీలను కోరారు. వీటిలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కళాశాలలను యూనివర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, క్లస్టర్ కళాశాలలను కలుపుతూ కొత్త యూనివర్సిటీ నెలకొల్పడం వంటివి ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో మరో 9 వర్సిటీలు ఏర్పాటు కానున్నాయని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల, కోఠి మహిళా కళాశాల వర్సిటీలుగా మారనున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో, విశాఖ జిల్లా పాడేరులో గిరిజన విశ్వవిద్యాలయాలు.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో లేదా ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది.