అప్పుల బాధతో మరో కౌలు రైతు ఆత్మహత్య
గుంటూరు/ తాడికొండ : పంటలు సక్రమంగా పండక, పండిన పంటకు సరైన ధరలేక, అప్పుల బాధతో గుంటూరు జిల్లాలో ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాటికొండ ఏఎస్‌ఐ కథనం ప్రకారం.... రాజుపాలెం గ్రామానికి చెందిన నేరేళ్ళ గురవయ్య (36) కొన్నాళ్లుగా బండారుపల్లి గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ గ్రామంలోనే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండడంతో అప్పులపాలయ్యాడు.
ఈసారి మూడెకరాలు మిరప, రెండెకరాలు పత్తి పంటలు వేశాడు. మిరప బొబ్బర తెగులు వచ్చి పూర్తిగా పాడైంది. పత్తి దిగుబడి లేక నష్టపోయాడు. ఈ నేపథ్యంలో రూ.5 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చాలని వేధింపులు అధికం కావడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన గురవయ్య సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు.
చుట్టుపక్కల వారు గమనించి గుంటూరు ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని భార్య నాగజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఆ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఏఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడు గురవయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.