హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..! | Another law to the High Court to be set up | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..!

Published Thu, Apr 27 2017 1:06 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..! - Sakshi

హైకోర్టు ఏర్పాటుకు మరో చట్టం కావాలి..!

- పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టత లేదు
- న్యాయాధికారుల నియామకం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయాధికారుల క్యాడర్‌ విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భం గా బుధవారం జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఉండాలన్న ఉద్దేశాన్ని మాత్రమే పార్లమెంటు ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొంది.

అయితే కానిస్టిట్యూట్‌(ఏర్పాటు) చేయాల్సింది ఎవరు? ఎప్పుడు ఏర్పాటు చేయాలి? ఎలా ఏర్పాటు చేయాలి? అన్న అంశాలను ఈ చట్టం ప్రస్తావించలేదు. పార్లమెం టు ఆ చట్టంలో ఈ అంశాలను పొందుపరిచి ఉండాల్సింది. కొత్త హైకోర్టు ఏర్పాటుకు కొత్త చట్టం అవసరం అన్నది మా అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?’’ అని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఈ కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్, హైకోర్టు రిజిస్ట్రీ తరఫు న్యాయవాది వేణుగోపాల్‌ను ప్రశ్నించారు.

రాష్ట్రపతి నోటిఫై మేరకే ఏపీ హైకోర్టు ఏర్పాటు..!
ఇందుకు జైసింగ్‌ సమాధానం ఇస్తూ.. పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 30 దీనిని నిర్వచించిందన్నారు. ఏపీకి ఆర్టికల్‌ 214, పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 31 కింద కొత్త హైకోర్టు ఏర్పడేవరకు హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉమ్మడి హైకోర్టుగా ఉంటుందని తెలిపారు.  ‘‘సెక్షన్‌ 31(1) ప్రకారం సెక్షన్‌ 30 నియమాలకు లోబడి ఏపీకి ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో హైకోర్టును తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా పిలవాలి. సెక్షన్‌31(2) ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన స్థానం.. రాష్ట్రపతి ఎక్కడ నోటిఫై చేస్తారో అక్కడ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.దీనిపై జస్టిస్‌ చలమేశ్వర్‌ స్పందిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.

ఇందిరా జైసింగ్‌ సమాధానమిస్తూ.. ‘‘భవిష్యత్తులో అక్కడ హైకోర్టు ఉంటుందని సెక్షన్‌ 30 చెప్పింది. హైకోర్టు ఏర్పాటు ఎక్కడ అన్న విషయం మాత్రమే నిర్ధారించాల్సి ఉంది. సెక్షన్‌ 5 రాజధాని గురించి చెప్పింది. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌ పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైకోర్టు గురించి ఈ సెక్షన్‌లో ప్రస్తావన లేదు..’’ అని పేర్కొన్నారు.  దీనికి జస్టిస్‌ చలమేశ్వర్‌ స్పందిస్తూ ‘‘కానిస్టిట్యూట్‌ అనే పదానికి అర్థం ఏంటి? మనకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే భౌతికంగా హైకోర్టు విభజన ఎప్పుడు జరగాలన్నదే. కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఈ చట్టం సరిపోతుందా? లేక కొత్త చట్టం కావాలా అన్నదే ఇక్కడ ప్రశ్న. రాజధాని అన్నది కేవలం ఒక భావన మాత్రమే. అదొక చట్టపరమైన పరిధి కాదు..’ అని పేర్కొన్నారు.

న్యాయాధికారుల విభజనపై నియమం ఏదైనా ఉందా?
న్యాయాధికారుల నియామకాల వివాదానికి సంబంధించి జస్టిస్‌ చలమేశ్వర్‌ పలు ప్రశ్నలు వేశారు.  దీనికి ఇందిరా జైసింగ్‌ స్పందిస్తూ.. సెక్షన్‌ 77, 78లలో ఉద్యోగుల సేవలు, విభజనకు సంబంధించిన ప్రాతిపదిక చెప్పారే తప్ప సబార్డినేట్‌ జ్యుడిషియల్‌ అధికారుల ప్రస్తావనేదీ లేదన్నారు. వీటి మార్గదర్శకాలు కేంద్రం రూపొందించాలా? లేక హైకోర్టు రూపొందించాలా? అన్న దానిపైనే వివాదం ఉందన్నారు.  హైకోర్టు రిజిస్ట్రీ తరపున వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ..ధర్మాసనం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరిస్తామన్నారు. తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది హరేన్‌ రావల్‌ తన వాదనలు వినిపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement