ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ప్రత్యేక హోదా కోసం మరో ఉద్యమం ప్రారంభమయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఇటీ వల వచ్చిన వార్తల నేపథ్యంలో పశ్చిమ ప్రజలు రగిలిపోతున్నారు. పోరాట పథంలో కదులుతున్నారు. రాష్ట్రంలోనే జిల్లాలో మొదటి సారిగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తమ పోరాటాలకు కార్యాచరణ రూపొందించుకున్నాయి. వివిధ ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఐక్య పోరాటాలకు సిద్ధమౌతున్నాయి. పలు ప్రజా సంఘాలు ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, బస్సు యాత్రలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తమ వంతు కృషి చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట నూతన వేదిక ద్వారా అన్ని వర్గాలనూ కలుపుకుని ఆందోళనాపథంలో పయనిస్తున్నాయి. సమైక్య రాష్ట్రం కోసం అన్ని వర్గాలూ ఏకమై ఆందోళనలు చేసిన రోజులు మళ్లీ గుర్తుకు వచ్చేలా ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కలిగించడానికి కృషి చేస్తున్నాయి.
ఆత్మాహుతితో పెరిగిన పట్టుదల
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ తిరుపతిలో శనివారం మునికామకోటి(41) ఆత్మహుతికి పాల్పడడం పలువురిని కలచివేసింది. హోదా కోసం మరో మహోద్యమం చేయాలనే పట్టుదలను వివిధ వర్గాలలో రేపింది. ఇప్పటికే పోరుబాట పట్టిన సంఘాలు ఈ దుర్ఘటన నేపథ్యంలో అంతా ఏకమై ఆందోళనలకు దిగడానికి సమాయత్తమవుతున్నాయి.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా సాధన ఒక్కటే లక్ష్యంగా పోరాటమార్గాన పయనించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
జగన్ ఆందోళనకు వివిధ వర్గాల మద్దతు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం కట్టుబడి పనిచేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలను ఆయన వైపు ఆకర్షింపచేసింది. జగన్ ఇప్పటికే రాష్ట్ర ప్రజల కోసం తమ పార్టీ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ప్రత్యేక హోదా సాధన కోసం భారీ ఆందోళన తలపెట్టారు. ఈ ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు ఉవ్వెత్తున వచ్చి పడింది. వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు వివిధ వర్గాల వారు ఈ ఆందోళనలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఢిల్లీ వెళ్లారు. ఈ ఆందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం వస్తుందనే నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రకటించి ఆ మేరకు కార్యాచరణకు దిగుతున్నాయి. ప్రత్యేక హోదా సాధనపై కొంతమంది నాయకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలి
మిత్రపక్షమైనా కేంద్రంలోని బీజేపీ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన టీడీపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే బయటకు రావాలి. చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవాడు. అధికారంలోకి వచ్చిన తరువాత జపాన్, సింగపూర్ అంటూ విదేశీ ప్రయాణాలపై చూపిన శ్రద్ధలో ఒక్క శాతమైనా ఢిల్లీలో కూర్చుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంపై చూపి ఉంటే ఈ పాటికి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన విడుదల చేసి ఉండేది.
కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఉద్యమ పిడికిలి
Published Mon, Aug 10 2015 1:10 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement