విజయవాడకు ఎన్‌ఐడీ
- జిల్లాకు మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మంజూరు
- కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
- దేశంలో కేటాయించిన నాలుగు ప్రాంతాల్లో బెజవాడ ఒకటి
సాక్షి, విజయవాడ : విజయవాడ నగరానికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రానుంది. విజయవాడలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిజైన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో దేశంలో నాలుగుచోట్ల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిజైన్ (ఎన్‌ఐడీ)లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. విజయవాడతో పాటు భోపాల్, అస్సాంలోని జోర్హాట్, హర్యానాలోని కురుక్షేత్రలో రూ.434 కోట్ల రూపాయలతో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ సంస్థలలో గ్రాడ్యుయేషన్‌తో పాటు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉంటాయి. సేవా రంగంతో పాటు ప్రపంచ స్థాయి డిజైన్లను తయారు చేసేందుకు ఈ ఎన్‌ఐడీలు ఉపయోగపడతాయి. డిజైన్ ఎడ్యుకేషన్, రీసెర్చి విభాగాల్లో ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సంస్థ అమెరికాకు చెందిన బిజినెస్ వీక్ పత్రిక ఎన్‌ఐడీని యూరోప్‌తో పాటు ఆసియాలోని టాప్ 25 స్థానాల్లో ఒకటిగా ప్రకటించింది. కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు చెందిన పారిశ్రామిక విధానం, పురోగతి విభాగం ఆధ్వరంలో ఆటానమస్ బాడీగా ఈ సంస్థ నడుస్తుంది