- - మూడుకు చేరిన మృతుల సంఖ్య
ఒంగోలు సెంట్రల్: జిల్లాలో స్వైన్‌ఫ్లూతో శనివారం ఉదయం మరొకరు మృతిచెందారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకూ స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. వివరాల్లోకి వెళ్తే..ఇంకొల్లుకు చెందిన కావూరి కోకిలాదేవి (72) అనే వృద్ధురాలు ఈనెల 23వ తేదీ తీవ్ర జలుబు, దగ్గు, జ్వరంతో ఒంగోలు నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆమెను పరీక్షించి స్వైన్‌ఫ్లూగా అనుమానించి చికిత్స ప్రారంభించారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐడీఎస్పీ సిబ్బంది కోకిలాదేవి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఐపీయం ల్యాబ్‌కు పంపించారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు మూడు రోజుల క్రితం నిర్ధారణ అయింది. పరిస్థితి విషమించిన ఆమె శనివారం ఉదయం మృతిచెందింది. రాష్ట్ర చైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్ జాయింట్ డెరైక్టర్ జె.వి.వి.ఆర్.కె.ప్రసాద్ శనివారం ఒంగోలు చేరుకుని మృతురాలు చికిత్స పొందిన ప్రైవేటు వైద్యశాలను సందర్శించి, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.