మరో రెండు రోజులు పింఛన్ల పరిశీలన
సాక్షి, కాకినాడ :సామాజిక పింఛన్‌దారుల్లో అనర్హులను వేరు చేసేందుకు నిర్వహిస్తున్న సర్వే (పరిశీలన) కార్యక్రమాన్ని మరో రెండురోజుల పాటు పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సాంకేతిక సమస్యలతో పింఛన్‌దార్ల సర్వేలో జాప్యం జరుగుతోందని, మరో రెండురోజులు పొడిగించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో పాటు పలు జిల్లాల అధికారులు చేసిన అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కొత్తగా పింఛన్ కోసం ఎవరైనా దరఖాస్తు చేస్తే తీసుకుని వారిలో అర్హులెంతమంది ఉన్నారో క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సీఎం ఆదేశించారు.
అక్టోబర్-2వ తేదీ నుంచి 15 రోజుల పాటు రాష్ర్ట వ్యాప్తంగా ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టాలన్నారు. దీనికోసం మండల స్థాయిల్లో కమిటీలు వేసుకోవాలని ఆదేశించారు. కొత్తగా తీసుకుంటున్న దరఖాస్తులను పరిశీలించాక, జన్మభూమి కార్యక్రమంలో అనర్హులుగా నిర్ధారించిన తర్వాత కొత్తగా గుర్తించిన వారికి పెంచిన పింఛన్ల పంపిణీని చేపట్టాలన్నారు. అక్టోబర్-2 నుంచి ఎన్టీఆర్ సుజల స్రవంతితో పాటు పెంచిన పింఛన్ల పంపిణీ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పేదరికంపై పోరాటం, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పరిశుభ్రత-ఆరోగ్యం తదితర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేజీ బేసిన్‌లో సహజవాయువుసంపదతో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే 18 నెలల్లో కాకినాడలో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ అందుబాటులోకి రానుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ పింఛన్ల పరిశీలనను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జన్మభూమి-మావూరు కార్యక్రమం కోసం శాఖల వారీగా కార్యాచరణలు, తేదీల వారీగా షెడ్యూళ్లు తయారు చే సుకోవాలని అధికారులకు సూచించారు. ఏజేసీ డీ మార్కండేయులు, డీఆర్వో బి. యాదగిరి, డీఆర్‌డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు, హౌసింగ్ పీడీ సెల్వరాజ్, జెడ్పీ సీఈఓ మజ్జి సూర్యభగవాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.