ఆక్వాపార్క్ తరలించేంత వరకు పోరాటమే
బాధితులకు అండదండలు అందిస్తామని జగన్ హామీ
మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ని తరలించేంత వరకు పోరాటం ఆగదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అన్ని విధాలా అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్‌ను కలిశారు. పోరాట కమిటీ నేతలు ఆరేటి సత్యవతి, ఆరేటి వాసు, ఎంపీటీసీ సత్యనారాయణల నేతృత్వంలో జైలు నుంచి బయటకి వచ్చిన అన్ని గ్రామాల పోరాట కమిటీ నేతలు, బాధితుల వెంట వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని, పార్టీ కో ఆర్డినేటర్లు గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజులు కూడా ఉన్నారు.
ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణ వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపినందుకు జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 45 రోజులు పాటు బెరుుల్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్న ప్రభుత్వం జగన్ పరామర్శించి వెళ్లిన వెంటనే బెరుుల్ ఇచ్చి విడుదల చేసిందని చెప్పారు.ఇప్పటికీ ఆక్వాఫుడ్ ప్యాక్టరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ ఫ్యాక్టరీ అక్కడ నుంచి తరలించేంతవరకు తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఆక్వాపుడ్ పార్క్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి చివరివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అవసరమైతే మరోసారి తుందుర్రుకు వస్తానని చెప్పారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు.
మతపరమైన హక్కుల పోరాటానికి మద్దతు నివ్వండి : భారత రాజ్యాంగంలోని 25, 26 అధికరణల కింద ముస్లింలకు లభించిన మతపరమైన హక్కుల పరిరక్షణకు తాము చేస్తున్న పోరాటానికి మద్దతు నివ్వాలని పలువురు ముస్లిం మైనారిటీల నేతలు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్‌బాష నేతృత్వంలో ప్రతినిధి వర్గం బుధవారం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుంది. అనంతరం అంజాద్‌బాష మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ లాగే జగన్ కూడా ముస్లింలకు అండగా నిలవాలని తాము కోరినట్లు వివరించారు. తాము చెప్పింది సాంతం విన్న జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.