అనంతపురం జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని
వ్యతిరేకిస్తూ నేటి నుంచి ఈ నెల 12 వరకు ప్రైవేట్ పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు గురువారం ఇక్కడ వెల్లడించాయి. అలాగే విద్యుత్ సంస్థకు చెందిన ఉద్యోగులు నేడు, రేపు మూకుమ్మడి సెలవులు పెట్టారు.
జాక్టో,ఏపీఎన్జీవో, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అనంతపురం నగరంలోని ఎస్కేయూ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల ప్రాంగణంలో విద్యార్థుల ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో సమైక్యవాదులు నేడు లక్ష జన గళ ఘోషను నిర్వహిస్తున్నారు.