జజ్జనకరి... జనాలే.. జనసంద్రంలా సీమాంధ్ర | seemandhra people strikes raise in seemandhra regions | Sakshi
Sakshi News home page

జజ్జనకరి... జనాలే.. జనసంద్రంలా సీమాంధ్ర

Published Fri, Sep 6 2013 3:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

జజ్జనకరి... జనాలే..  జనసంద్రంలా సీమాంధ్ర - Sakshi

జజ్జనకరి... జనాలే.. జనసంద్రంలా సీమాంధ్ర

స్వచ్ఛంద ఉద్యమానికి 37రోజులు
సమైక్య భావనతో ఉప్పొంగుతున్న హృదయాలు
అందరి నోటా ఒకే మాట...తెలుగుజాతిని చీల్చవద్దు...

 
 సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని రోడ్డుపైనే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు సామూహికంగా సెలవులపై వెళ్లారు. దీంతో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమైక్యాంధ్ర చేపట్టిన దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు గురువారం 37వ రోజూ ఉధృతంగా కొనసాగాయి.
 
 అనంతపురం జిల్లా పామిడిలో సకల జనుల సమైక్య గర్జనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు తమ జీతాలను, జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తోంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు విందులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మడకశిరలో మాదిగలు నిర్వహించిన సింహగర్జన సమైక్య ర్యాలీలో ఎమ్మెల్యే సుధాకర్‌ను రాజీనామా చేయాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరులో ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటాలతో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది సామూహిక సెలవుపై వెళ్లారు.
 
 చంద్రగిరి మండల ప్రజలు రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. నెల్లూరులో కేసీఆర్‌ను వలవేసి పట్టుకున్నట్లుగా వినూత్న నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో బంద్ పాటించారు. ఆమదాలవలసలో ఉపాధ్యాయుల దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే సత్యవతిని స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఎమ్మెల్యే అనడంతో గందరగోళం నెలకొంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉపాధ్యాయులు రోడ్లపైనే గురుపూజోత్సవాన్ని జరుపుకుని నిరసన తెలిపారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపైనే విద్యార్థులు భోజనాలు చేయగా, బద్వేలు పట్టణంలో బ్రాహ్మణులు రోడ్డుపైనే చండీయాగం చేపట్టారు. విశాఖలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని సన్మానించారు. కె.కోటపాడు విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు.
 
 కర్నూలులో విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ర్ట మంత్రి టీజీ వెంకటేష్ ఇళ్లను ముట్టడించారు. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, షిండే, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఊరేగించారు. విజయవాడలో సీమాంధ్ర  కాలేజీ యాజమాన్యాల జేఏసీ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లో రోడ్ల దిగ్బంధన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కిలోమీటరుకు పైగా టెంట్లువేసి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ‘గురువుల మహాదీక్ష’ చేపట్టారు. పాలకొల్లులో మునిసిపల్ ఉద్యోగులు ‘సమైక్యాంధ్ర నగర సంకీర్తన’ చేపట్టారు. గోదావరి డెల్టా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి ధవళేశ్వరం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించిన రైతులు కాటన్‌బ్యారేజీని ముట్టడించారు. ఇన్నీసుపేటలో విద్యార్థులు రోడ్డుపైనే గురుపూజోత్సవం నిర్వహించి, అధ్యాపకులను సన్మానించారు. 23 రకాల పప్పుధాన్యాలతో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని అంగన్‌వాడీ వర్కర్లు రూపొందించారు.
 
  48గంటల కోనసీమ బంద్ తొలిరోజు విజయవంతమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో గోవులతో నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది మేకలు, గొర్రెలతో భారీర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా శుక్రవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు విద్యుత్ ఉద్యోగులు కాకినాడలో ప్రకటించారు. అలాగే, 6,200 మంది ఈపీడీసీఎల్ ఉద్యోగులు గురువారం సామూహిక సెలవు పెట్టి విధులను బహిష్కరించారు. తెర్లాంలో 500 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో వైఎస్‌ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త  సుజయ్ కృష్ణారంగారావు పాల్గొన్నారు.  
 
 మరో ఆరుగురు మృతి
 రాష్ట్ర విభజన నిర్ణయంపై కలతతో భావోద్వేగానికి గురైన ఐదుగురు గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు, గతనెల 4న ఆత్మహత్యకు యత్నించిన సారెడ్డి రామాంజుల రెడ్డి (35) గురువారం మృతి చెందాడు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పొల్గొంటున్న ఇతను ఆ రోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.  
 
 సీఎం రాజీనామా చేయాలి
 తిరుపతి: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రులు, సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర  విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో  గురువారం సీమాంధ్ర విశ్వ విద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎంతో సహా ఇతర మంత్రులు ఈ నెల 11లోగా రాజీనామాలు చేసి తమతో కలసి ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే 12నుంచి వారి నివాసాల వద్ద రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రమంత్రి చిరంజీవి కూడా రాజీనామా చేయూలని, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల చిత్ర ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. నిరసనకారులపై అక్రమ కేసులను ఎత్తివేయూలని డిమాండ్ చేవారు.  ఈ సమావేశం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు హరికృష్ణయూదవ్, కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో జరిగింది.  
 
 సమైక్య ‘సాగర ఘోష’
 సీమాంధ్రలో గళమెత్తిన లక్షలాది జనం
 సాక్షి, నెట్‌వర్క్ : జై సమైక్యాంధ్ర అంటూ లక్షలాది గొంతుకలు గళమెత్తాయి. గురువారం కాకినాడలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో లక్ష జనగళ సమైక్య సాగర ఘోష నిర్వహించారు. పార్టీ రహితంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలతో కాకినాడ జనసాగరమైంది. ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్ సమైక్యాంధ్ర పాటలతో ప్రజలను ఉత్తేజపర్చారు. దేశ నాయకుల వేషధారణతో పలువురు ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రొద్దుటూరు పొలికేక’కు లక్ష మందికిపైగా హాజరయ్యారు.
 
 ఈ సందర్భంగా వంగ పండు ఉష ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి విశాలాంధ్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమైక్య సింహగర్జన జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం హాజరై సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. కృష్ణాజిల్లా  చల్లపల్లిలో సన్‌ఫ్లవర్ విద్యాసంస్థలు, జేఏసీ, మీడియా ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన లక్షగళ గర్జనతో రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్ష జనగళ ఘోష, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లక్ష గళార్చన శంఖారావం, చిత్తూరు జిల్లా పీలేరులో విద్యార్థి సమైక్య సింహగర్జన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్‌లో సింహగర్జన జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement