బాబును జాతి క్షమించదు: మేకపాటి
‘‘రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు దాన్ని వెనక్కు తీసుకోకుంటే తెలుగు జాతి ఆయనను క్షమించదు. ఈ అపవాదు ఆయన జన్మకే గాక ఆయన బిడ్డలకూ ఉంటుంది. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరం లేకుండా ఈ రాష్ట్రం ఎలా నడుస్తుందని బాబు అనుకుంటున్నారు? తెలంగాణలో పుట్టిన వారిగా కొందరు రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడంలో ఒక అర్థముంది. కానీ బాబూ! చిత్తూరు జిల్లాలో పుట్టిన వాడివి, నువ్వెలా (అందుకు) సిద్ధపడ్డావ్? ఏం జన్మ నీది? మనిషి రూపంలో ఉన్న వికృత రూపుడివి నువ్వు. రాజశేఖరరెడ్డి చనిపోయాక రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియా ప్రయత్నించడం దారుణం. కేసీఆర్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి వారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే తెలుగు ప్రజలందరి ఆమోదంతో ఆ పదవి తీసుకోవాలి. ఆరు నెలల కాలంలోనే జగన్‌మోహన్‌రెడ్డి వంటి సరైన నాయకత్వం రాష్ట్రాన్ని పాలించనుంది. అందుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు’’
ప్రజలను మోసగిస్తున్న కిరణ్: కొణతాల
‘‘అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని ఇప్పటికీ ముఖ్యమంత్రి తప్పుడు మాటలు చెబుతున్నారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓటింగ్ జరగదని స్పీకర్‌గా చేసిన ఆయనకు తెలియదా? తెలిసీ ప్రజలను మోసగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సీఎం పదవినైనా వదలిపెడతానంటున్న కిరణ్, రాష్ట్ర విభజన పూర్తయ్యాక ఆ పని చేస్తారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జెండాలతో గానీ, వాటి పక్కన పెట్టయినా ఎలా వీలైతే అలా కలిసి రావాలని కాంగ్రెస్, టీడీపీ నేతలకు జగన్ సూచించారు. ఇప్పటికైనా వారు తమ జెండాలతో గానీ, వాటిని పక్కన పెట్టయినా కలిసి రావాలి.’’
మంత్రి పదవిని వదులుకున్నా: విశ్వరూప్
‘‘విభజన వల్ల తలెత్తే సమస్యలేమిటో తెలుసు కాబట్టే రాష్ట్ర సమైక్యత కోసం నినదించి మంత్రి పదవికి రాజీనామా చేశా. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు సమ్మె చేసినా కేంద్రం స్పందించలేదు. వారు సమ్మె విరమించాక ఉద్యమంలో విరామం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ చాలా స్పష్టంగా సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చింది. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడగలిగేది వైఎస్సార్ కాంగెస్ పార్టీ ఒక్కటే. అందుకే నేనందులో చేరాను. ’’
ఢిల్లీ పీఠానికి జగన్ తుపాన్: జూపూడి
‘‘స్వార్థపూరితంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన ఢిల్లీ పీఠాన్ని ఇప్పుడు జగన్ అనే తుపాను తాకింది. ఆ తుపానులో కొట్టుకుపోయేందుకు వారు సిద్ధంగా ఉండాలి. ఎవర్నడిగి, ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? వైఎస్ మరణానంతరం ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కలిసి తీసుకున్న నిర్ణయమిది. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజిస్తారా?’’
మొరిగే కుక్కలకు జవాబివ్వగలం: కొడాలి
‘‘రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆజ్యం పోసిన దుర్మార్గుడు చంద్రబాబే. రాజశేఖరరెడ్డి మరణించాక తన దగ్గర ఉన్న పెంపుడు కుక్కలతో రోజూ వైఎస్సార్, జగన్‌పై మొరిగిపిస్తున్నారు. బాబుకు తగిన జవాబు చెబుతామంటుంటే, ‘ఆయన పెద్దాయన , ఎందుకులె’మ్మంటూ మా అధినేత సర్దిచెబుతున్నారు. అధినేత మాకు అవకాశమిస్తే, బాబు మొరిగిపిస్తున్న వారందరికీ జవాబు చెప్పగలిగే సత్తా ఉంది.’’
సమైక్యం చివరిదాకా పోరు: శోభానాగిరెడ్డి
‘‘పాలకులు అసమర్థులైతే ప్రజలు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఈ నాలుగేళ్ల పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. వైఎస్సార్ ఉండుంటే ఈ కష్టాలు వచ్చేవి కాదని అందరూ భావిస్తున్నారు. మళ్లీ అలాంటి నాయకత్వం జగన్‌తోనే సాధ్యం. బాబుకు జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సోనియాతో చేతులు కలిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి చేసిన ఉద్యమాలు కిరణ్, బాబులను కదిలించలేకపోయాయి’’
హైదరాబాద్ అందరిదీ: రెహ్మాన్
‘‘హైదరాబాద్ ఎవరబ్బ సొత్తూ కాదు, ఇది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలందరిదీ. ఇక్కడ నివసించేవారు ఏ భయాందోళనలూ పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు దిశా దశ లేవు. రాష్ర్టంలో దీక్ష చేస్తే రాళ్లతో కొడతారని భయపడి ఢిల్లీలో చేశారు. మా పార్టీ అధినేత జగన్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తామంటే అనుమతివ్వలేదు గానీ బాబుకు ఢిల్లీ ఏపీభవన్‌లో అనుమతిచ్చారు.’’
సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి: నల్లా
‘‘రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు కూడా బాగా లబ్ధి పొందారు. మళ్లీ అలాంటి పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు’’
వాదనల మధ్య ఘర్షణ: గట్టు
‘‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ కాదు, రెండు వాదన మధ్య ఘర్షణ. తీర్పేమిటో ప్రజలే చెబుతారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తేనే ఉద్యమంలో పాల్గొంటామని అప్పట్లో ఇక్కడి నేతలు గాంధీకే తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రానికే జగన్ ముఖ్యమంత్రి కావాలని మే కోరుకుంటున్నాం’’
తీర్మానంతో బాబు ముందుకు రావాలి: దాడి
‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయడానికి చంద్రబాబు ముందుకు రావాలి. పీసీసీ కూడా అలాంటి తీర్మానం చేయాలి. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్ముతారు. విభజనకు ఉత్సాహం చూపుతున్న సోనియా, బాబులను బహిష్కరించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు’’
విభజిస్తే దిశ దశ ఉండవు
‘‘రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే దిశ దశ ఉండవు. హైదరాబాద్ నగరం మనదని భావించే కోస్తాలో ఎకరాలు అమ్ముకుని ఇక్కడ గజాల స్థలం కొని అభివృద్ధి చేశాం. ఐటీ, ఫార్మా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాక, ఇప్పుడు వెళ్లిపోమడం ఎంతవరకు సమంజసం?’’
-గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు
అభినందనీయం
‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమిస్తున్న వైఎస్సార్‌సీపీకి, జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. కొందరు నేతలు రహస్య ఎజెండాతో విభజనతో మన భవిష్యత్తును అంధకారం చేయజూస్తున్నారు. ’’
-ఏవీ పటేల్, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ నేత
విద్యార్థుల భవిష్యత్తేమిటి?
‘‘రాష్ర్టం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. చదువుల తర్వాత తమ భవిష్యత్తేమిటనే బెంగ వారిలో ఉంది. వెఎస్సార్ సీపీ నిర్ణయాన్ని సీమాంధ్రలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులమూ స్వాగతిస్తున్నాం. ’’
-అడారి కిషోర్‌కుమార్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత
'సమైక్య శంఖారావం' సభలో ఎవరేమన్నారు...
Published Sun, Oct 27 2013 2:46 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement