రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యావాదులు సీమాంధ్రలో చేపట్టిన ఉద్యమం ఉప్పెనలా కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు నిరసనలు మిన్నంటాయి. విభజనకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణాదాస్ తన నియోజకవర్గంలో నేడు ఉయదం నుంచి సాయంత్రం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఆయనచేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9.00 గంటలకు మడపాం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 5.00 గంటలకు కృష్ణాదాస్ నియోజవర్గమైన నరసన్నపేట చేరుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కేబుల్ టీవీ చానల్స్ ప్రసారాలను శుక్రవారం నిలిపివేస్తున్నట్లు ఎమ్‌ఎస్‌వోల సంఘం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 5.00గంటలకు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనాలని ఆ సంఘం సిబ్బందికి పిలుపునిచ్చింది. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. విజయనగరం, విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణ, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిలాలల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి.
అయితే రాయలసీమా ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. అయితే తిరుపతిలో మాత్రం ఆర్టీసీ బస్సులు తిరుమలకు వెళ్తున్నాయి. రవాణ సౌకర్యాలు లేకపోవడంతో తిరుమలో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్యా చాలా వరకు తగ్గింది. గురువారం తిరుపతి నుంచి కేవలం 75 బస్సులు మాత్రమే తిరుమల వెళ్లాయి.