హైదరాబాద్: సభ్యులు గందరగోళ పరిస్థితుల మధ్య అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు వేరు వేరుగా నినాదాలు చేసి ఆందోళనలు కల్గించడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టి ముట్టి ఆందోళనకర పరిస్థితులు సృష్టించారు. తొందర పాటు చర్యలు పాల్పడకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గత బుధవారం జరిగిన బీఏసీలో బిల్లుపై వారం రోజులు చర్చించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు సభకు సెలవు కావడంతో తిరిగి అసెంబ్లీ సోమవారం ఆరంభమైంది. గందరగోళం నడుమ తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు స్వాగతించగా, సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభను మంగళవారానికి వాయిదా వేయక తప్పలేదు.