దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ భయాందోళనల నడుమే కరోనా కేసుల ఉధృతి కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. తాజాగా మహా అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై కూడా కరోనా కోరలు చాచింది.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సాధారణంగా నాగ్‌పూర్‌లో జరగాలి. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో ఈసారి ముంబైలో నిర్వహించింది శివసేన సర్కార్. డిసెంబర్ 22న ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఐదు రోజుల సమావేశాల కారణంగా.. మొత్తం 50 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్వయంగా వెల్లడించారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం గమనార్హం.
మంత్రి వర్ష గైక్వాడ్ (ఫైల్ ఫొటో)
ప్రశ్నోత్తరాల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విద్యాశాఖ(పాఠశాల) మంత్రి వర్ష గైక్వాడ్(కిందటి ఏడాది కూడా ఆమె వైరస్ బారినపడ్డారు) కరోనా బారినపడ్డారు. మరో మంత్రి కేసీ పాడ్వికి కూడా వైరస్ సోకింది. ఇక శాసనసభలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పలువురు పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవార్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 167 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్త: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా..
Comments
Please login to add a commentAdd a comment