సాక్షి, శ్రీకాకుళం : గ్రామ వాలంటీర్లందరూ సచివాలయ సైనికులని, గ్రామీణ పాలనా వ్యవస్థకు మూలమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఆరా తీస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీలంక, మలేషియా దేశాల నుంచి కూడా పరిశీలనకు సిద్ధమయ్యారని తెలిపారు. సోమవారం పొందూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జరిగిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4.50 లక్షల వాలంటీర్లు, 1.50 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ రాష్ట్ర, దేశ చరిత్రలో గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వాలని, ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడి మనసుతో పాలన చేస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం కోసం శాసనసభలో చట్టాలను తీసుకువచ్చామని, వచ్చే శాసనసభలో 50 శాతం మహిళలతో నిండిపోతుందని అన్నారు. ప్రతీ గ్రామ సచివాలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీపీఎస్సీ, ఎక్సైజ్, డీఎస్సీ తదితర ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. తన విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని, ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయనని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment