
విజన్ 2029 సాకారమే లక్ష్యం
రూ.1.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల
సాక్షి, అమరావతి: సవాళ్లను అధిగమించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం ద్వారా విజన్ 2029ను సాకారం చేసేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. అంతర్జాతీయ, దేశీయ, స్థానిక పరిణామాలకు అనుగుణంగా పాలనా విధానాలను సవరించుకుంటూ, సంస్కరణలు చేపట్టడం ద్వారానే ఆశించిన భవిష్యత్‌ను సాధించుకోగలుగుతామన్నారు. సమర్థంగా ఆదాయ వనరులను సమీకరించడం, ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తామన్నారు. 2017 – 18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,56,999.40 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. 2016 – 17తో పోల్చితే ఈ బడ్జెట్ అంచనాలు 15.70 శాతం ఎక్కువ అని చెప్పారు. 2016 – 17 బడ్జెట్ కేటాయింపులను ఆంగ్లంలో చదివిన యనమల ఈ పర్యాయం మాత్రం తడబడుతూ, సరిదిద్దుకుంటూ తెలుగులో 46 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేశారు.
భవిష్యత్తులో పెరగనున్న ఆదాయం
ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి రానుందని యనమల పేర్కొన్నారు. ‘దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆదాయం పెరగనుంది. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన వనరులను కూడా సమీకరించుకోవడానికి అనువుగా ఆర్థిక విధానాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం.
మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు, విదేశీ పథకాల ద్వారా అందుతున్న నిధులన్నింటినీ పోగుచేసి జీవన ప్రమాణాలను, నాణ్యతను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తున్నాం. నైపుణ్య పెంపు, శిక్షణతో ఉద్యోగావకాశాలు మెరుగుపర్చడం ద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం పొందేలా చూడట మే ఈ ప్రయత్నాల అంతిమ లక్ష్యం’ అని పేర్కొన్నారు.
ఇక రెవెన్యూ – క్యాపిటల్...
ఇప్పటిదాకా బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర విభాగాలు ఉన్నాయని, ఇప్పుడు బడ్జెట్‌ను రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయంగా వర్గీకరించామని యనమల చెప్పారు. ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు..
♦ విజన్ 2029 ప్రకారం ప్రతి ఏటా 12 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.
♦ వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,091 కోట్లు , గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు కేటాయించాం.
♦ వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా ఎనిమిది మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు నెలకొల్పడానికి ప్రయత్నాలు.
♦ రాష్ట్రంలో మరో 7 ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లష్టర్లు
♦ వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న భూమిలేని నిరుపేద దళిత మహిళలకు వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అందించే పథకం పునరుద్ధరణ. ఈ పథకం కింద యూ నిట్ ధర ఎకరానికి రూ.15 లక్షలదాకా పెంచడంతోపాటు 75% సబ్సిడీ, వడ్డీ నిమిత్తం ఆర్థిక సాయం.
♦ ఎస్సీల గృహాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత విద్యుత్తును 50 యూనిట్ల నుంచి 75 యూనిట్లకు పెంపు.
♦ తోటపల్లి, గాలేరు నగరి సుజల స్రవంతి మొదటి దశ, హంద్రీ–నీవా సుజల స్రవంతి, వంశధార రెండో దశ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ 2018 నాటికి పూర్తి.
♦ త్వరలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు ప్రారంభం.
♦ ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే కొత్త ఎక్సైజ్ విధానానికి సవరణలు.
♦ రానున్న రెండేళ్లలో పది లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం.
ప్రత్యేక హోదా లేదు...
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండదని ఆర్థిక మంత్రి యనమల తేల్చి చెప్పారు. గతంలో టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి చెప్పినట్లే యనమల కూడా నెపాన్ని 14వ ఆర్థిక సంఘంపైకే నెట్టేశారు. ‘రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయం హామీని పొందగలిగాం. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం..’ అని యనమల పేర్కొన్నారు.
రూ.18,214 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమం–లాభసాటి వ్యవసాయం పేరిట 2017–18 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో రూ.18,214 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రుణమాఫీ పథకానికి రూ.3,600 కోట్లు, రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.3,300 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.6,040 కోట్లు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్తిపాటి ప్రవేశపెట్టిన నాలుగో వ్యవసాయ బడ్జెట్ (నూతన అసెంబ్లీలో తొలి బడ్జెట్)లో రైతన్న జీవితాలను స్వర్ణమయం చేయడమే ఆశయంగా ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.5,525 కోట్లను ప్రతిపాదించగా ఇందులో ప్రణాళిక వ్యయం రూ.1,170 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.4,355 కోట్లుగా ఉంది.