
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరనున్నారు. అధికారవర్గాల కథనం ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.11 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు సంబంధించి నిధుల కోసం ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి ఉన్న రూ.15,691 కోట్ల లోటును భర్తీ చేసేందుకు కేంద్రంలోని గత ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరనున్నారు.
రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర విద్యాసంస్థలకు కేటాయించిన భూములపై కేంద్రానికి ఇచ్చిన నివేదికను వివరించి, ఆ సంస్థలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలు గవర్నర్‌కు అప్పగించే అంశంపై ఇంతకుముందు ప్రధానికి రాసిన లేఖ విషయాన్ని గుర్తుచేయనున్నారు. తెలంగాణ సీఎంతో జరిగిన చర్చల వివరాలను కూడా ప్రధానికి వివరించే అవకాశాలున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.