
మీరు ముక్కుసూటిగా పోతే మాకు దెబ్బ
మీరంతా మా డెరైక్షన్‌లో పనిచేయండి..: కలెక్టర్లు, ఎస్‌పీల సదస్సులో చంద్రబాబు
విజయవాడ: ‘‘ప్రభుత్వపరంగా మేమొక డెరైక్షన్‌లో పోతున్నాం. మీరు అట్లా కాకుండా.. ‘మేం కరెక్టుగా ముక్కుసూటిగా పోతున్నామ’ంటే.. మీరు పోతారు. దెబ్బ తగిలేది మాకు. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. నేను చెబుతున్నదాంట్లో మీరంతా స్పష్టంగా ఉండాలి. అందరూ అదే డెరైక్షన్‌లో పనిచేయాలి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలకు నిర్దేశించారు. ‘‘నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. ఇది పొలిటికల్ గవర్నెన్స్. ఆ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. మీరు చేసే ప్రతి ఒక్క పనీ మాపై ప్రభావం చూపుతుంది. కలెక్టర్ బాగా పనిచేస్తే మేం మరో ఐదారు సీట్లు గెలుస్తాం. మళ్లీ అధికారంలోకొస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలో నిర్వహించిన కలెక్టర్లు, ఎస్‌పీల సమావేశంలో బాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సదస్సు సాగింది. 13 జిల్లాల కలెక్టర్లు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం ముగిశాక కలెక్టర్లు, ఎస్పీలతో విడిగా మాట్లాడారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
వాళ్లందరినీ సంతృప్తి పరచాల్సి ఉంటుంది
‘‘ప్రజాస్వామ్యంలో ఒక విధానం ఉంటుంది. రేపటి రోజున మేం పోతే మీరెవరూ మాకు కనబడరు. మళ్లీ మేం వెళ్లేది కార్యకర్తల దగ్గరకే. వాళ్లందరనీ మేం సంతృప్తి పరచాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. ప్రభుత్వ హామీలు నెరవేర్చడానికి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి జిల్లాల్లో కలెక్టర్లే సంపద సృష్టించాలి. ఆదాయం పెరిగే మార్గాలను అన్వేషించాలి. కలెక్టర్లు తప్పు చేస్తే కాపాడలేను. కాలక్షేపం చేస్తే సరిపోతుందనే ఆలోచన వద్దు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంపికైన కేడర్ ఆఫీసర్లలో ఇది మరీ ఎక్కువగా ఉంది. కష్టపడి పని చేయాలి.
రుణ మాఫీకి ఆర్‌బీఐ అడ్డుపడుతోంది...
ైరె తులకు, పేదలకు మేం చాలా హామీలిచ్చాం. రైతు రుణాను, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామన్నాం. ఇప్పుడు ఆర్‌బీఐ అడ్డుపడుతోంది. రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలని ఆర్‌బీఐకి మరోసారి లేఖ రాస్తా. చేయకపోతే ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తాం. జిల్లా స్థాయి బ్యాంకర్లతో మాట్లాడి రైతులకు ఎలాగైనా పంట రుణాలు ఇప్పించే బాధ్యత కలెక్టర్లే తీసుకోవాలి. ఏపీ విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్ చేస్తుంది. అయితే ఏపీ విద్యార్థులెవరో తెలంగాణ ప్రభుత్వమే తేల్చాలి. రుణాల మాఫీ, నిత్యావసర సరుకులు, ఫించన్లు, స్కాలర్‌షిప్‌ల పంపిణీ కోసం ప్రతి ఒక్కరినీ ఆధార్‌కు అనుసంధానం చేయండి.
రాష్ట్రం మధ్యలోనే రాజధాని
కొత్త రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉంటుంది. అదెక్కడో మేమే నిర్ణయిస్తాం. మనుషులు, ప్రత్యేక జీవనం, ఉపాధి అవకాశాలు, సకల సదుపాయాలు ఉన్నచోటే రాజధాని ఉంటుంది. విశాఖ, తిరుపతి, విజయవాడలను మెగాసిటీలుగా, మరో 13 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి.