వైఎస్‌ జగన్‌: కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించిన సీఎం | YS Jagan Launches Connect to Andhra Web Portal - Sakshi
Sakshi News home page

కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించిన సీఎం

Published Fri, Nov 8 2019 3:44 PM | Last Updated on Fri, Nov 8 2019 8:07 PM

AP CM YS Jagan Launches Connect To Andhra Web Portal - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన ‘కనెక్ట్‌ టూ ఆంధ్రా’ వెబ్‌ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఈ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’ ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం కావాలని గతంలోనే సీఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చు అని అన్నారు.

‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యం కాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి, మీ జిల్లాలో ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. దానికి ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్, ప్రణాళికా సంఘం డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement