భారతదేశానికి రావడం కోసం కువైట్‌లో నమోదు ప్రక్రియలో మన వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తిరిగి రావాలనుకుంటున్న వలసదారుల నమోదు ప్రక్రియ, వారిని పంపించే ఏర్పాట్లు సజావుగా సాగేలా ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాల అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతదేశం వస్తున్న వలసదారుల సమాచారాన్ని (డేటా) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలకు అందించేలా చూడాలి. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఏర్పాట్లతో వారి రాకకై సిద్ధంగా ఉంటాయి. – సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరిం చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, ఆ సందర్భంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఆ లేఖలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి.
విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రావొచ్చు
► కోవిడ్19 సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు కోల్పోయి, అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాక భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారి సంఖ్య మరింత పెరగొచ్చు.
► దుబాయ్‌లో, ఇతర దేశాల్లో భారత దౌత్యకార్యాలయాలు స్వదేశానికి తిరిగి వెళ్లే భారతీయుల సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టాయి. ఇతర రాష్ట్రాల వారితో పాటు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వలసదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికంగా ఉన్నారు.
► భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణ సదుపాయాలను తిరిగి ప్రారంభించాక గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలసదారులు కొన్ని వేల మంది ఉంటారు. వీరి భద్రత, క్షేమం కోసం, క్వారంటైన్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంది.
► ఏప్రిల్ 30 గడువులోగా నమోదు చేసుకోవటానికి, ఏప్రిల్ 29న కువైట్‌లోని మన రాయబార కార్యాలయానికి వలస కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ నమోదు ప్రక్రియలో రాయబార కార్యాలయం వద్ద వారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
► గత 6 వారాలుగా వివిధ దేశాలలో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు, సందర్శకులు భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే స్వదేశానికి తిరిగి రావడానికి వేచి ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
► ముఖ్యమంత్రి లేఖను ఏపీఎన్‌ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ పత్రికలకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment