'జూన్ 2న విజయవాడకు తరలండి'
హైదరాబాద్: "వచ్చే నెల (జూన్) 2న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులెవరూ హైదరాబాద్‌లో ఉండటానికి వీల్లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రధాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దీనికి నవ నిర్మాణ దీక్ష అనే పేరు పెట్టారు. ఈ నవ నిర్మాణ దీక్షకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌లందరూ తమ ఉద్యోగులతో కలిసి విజయవాడ మున్సిపల్ స్టేడియానికి జూన్ 2న ఉదయం 9 గంటలకు చేరుకోవాలి" అని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ బుధవారం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు.
'సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని ముఖ్యమంత్రి సత్కరిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా నవ నిర్మాణ దీక్ష పేరుతో ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆ సర్క్యులర్‌లో సూచించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష తరువాత 3 నుంచి 7వ తేదీ వరకు "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం నిర్వహించాలని, 8న బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని సీఎస్ అందులో పేర్కొన్నారు.