ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి ఢోకా లేదు
అభినందన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విశాఖపట్నం: సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రత్యేక హోదాకు ప్రణాళికా సంఘం ఆమోదం లేదనడం సరికాదన్నారు. ప్రణాళికా సంఘ ఛైర్మన్ గా ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తారని, ఆయనే ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించడం వల్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ ద్దని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శనివారం విశాఖ వచ్చిన ఆయన్ని బీజేపీ నగరశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రణాళికా సంఘం సలహా సభ్యులు సంబంధిత మంత్రికి కేవలం ప్రత్యేక హోదా ఎలా ఇస్తారనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చారని, ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఉండాల్సిన పరిధి, నియమ నిబంధనలు వివరించారని చెప్పారు.
ఈ నిబంధనలన్నీ సీమాంధ్రకు లేవంటూ మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఉంటుందని, ఆ కాలంలో విస్తారంగా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. సీమాంధ్రకు రాజధానిగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నందున రైల్వే జోన్ కేంద్రంగా విశాఖను చేస్తామని ప్రకటించారు. ఐఐఎం ఓ చోట, ఐఐటీ మరో చోట ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, శంకరంపల్లిలో విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేయాలని లేఖలు రాశానన్నారు.