హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ఫలానా చోట ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి దిశా నిర్దేశం చేయబోదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను అందజేసినా రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. కొత్త రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారని, ఇది తానొక్కడినే నిర్ణయించే అంశం కాదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరుగుతున్న విద్యుత్ ఒప్పందాల వివాదం విషయంపై కేంద్ర మంత్రి స్థానంలో ఉండి తాను మాట్లాడబోనని, జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా కేంద్రమే జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
చార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకుంటారు..
మొన్నటి వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, యూపీఏలు రైల్వే చార్జీల పెంపును బలవంతంగా తమపై రుద్దాయని వెంకయ్య విమర్శించారు. రైల్వే చార్జీలపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున మొదటిసారి ఎన్నికైన సభ్యులకు ఈ నెల 28, 29 తేదీలలో సూరజ్‌కుండ్‌లో పార్లమెంట్ వ్యవహారాలపై శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వెంకయ్య చెప్పారు.
రాజధానిపై నిర్ణయం రాష్ట్రానిదే: వెంకయ్య
Published Mon, Jun 23 2014 1:46 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM
Advertisement
Advertisement