ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఉత్తీర్ణతలో బాలురకన్నా బాలికలే ఆధిక్యంలో నిలిచారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 10,64,626 మంది (ఫస్టియర్ 5,46,365, సెకండియర్ 5,18,261) ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఫస్టియర్ జనరల్‌లో 59 శాతం, ఒకేషనల్‌లో 41 శాతం, సెకండియర్ జనరల్‌లో 63 శాతం, ఒకేషనల్‌లో 52 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అన్ని కేటగిరీల్లోనూ బాలికలు పైచేయి సాధించారు.
జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,57,619 మంది బాలికలు హాజరు కాగా 1,64,365 (64 శాతం), సెకండియర్ పరీక్షలకు 2,22,798 మంది బాలికలు హాజరు కాగా.. 1,49,010 (67 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర విషయానికి వస్తే.. జనరల్ కేటగిరీ ఫస్టియర్ పరీక్షలకు 2,49,611 మంది హాజరు కాగా.. 1,36,195 (55 శాతం), సెకండియర్‌లో 2,12,857 మందికి గాను 1,27,379 (60 శాతం) మంది పాసయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లోనూ 75 శాతం ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో 65 శాతం, సెకండియర్‌లో 71 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా ఫస్టియర్‌లో 63 శాతం, సెకండియర్‌లో 68 శాతం ఉత్తీర్ణత సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణతా శాతంలో వైఎస్సార్ (ఫస్టియర్ 47 శాతం, సెకండియర్ 52 శాతం), శ్రీకాకుళం (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 53 శాతం), కర్నూలు (ఫస్టియర్ 51 శాతం, సెకండియర్ 54 శాతం) జిల్లాలు వెనుకబడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment