'విచక్షణ' కోల్పోతోందా? | AP Election Commissioner Nimmagadda Ramesh kumar Supports TDP | Sakshi
Sakshi News home page

'విచక్షణ' కోల్పోతోందా?

Published Mon, Mar 16 2020 4:28 AM | Last Updated on Mon, Mar 16 2020 4:28 AM

AP Election Commissioner Nimmagadda Ramesh kumar Supports TDP - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షం ఇచ్చిన సవరణలు, సెలక్ట్‌ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం రికార్డుల్లోకి రాలేదు. ఏదైనా బిల్లు సభలోకి వచ్చినప్పుడు 12 గంటల్లోపు సవరణలు, సెలక్ట్‌ కమిటీకి పంపే నోటీసులు ఇవ్వాలి. కానీ, అవి ఆలస్యంగా అందాయి. ఈ తప్పు ఎలా జరిగిందో జరిగింది. సవరణలు, సెలక్ట్‌ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం లేవని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా దీనిపై రూలింగ్‌ ఎలా ఇవ్వాలా అని ఆలోచించా. 154వ నిబంధన ప్రకారం నాకున్న విచక్షణాధికారాలతో ఈ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపుతున్నా’’ 
– 2020 జనవరి 22న శాసన మండలిలో చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ 

‘‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నాం. రాజ్యాంగం ద్వారా, పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్‌గా నాకు సంక్రమించిన విస్తృత, విచక్షణాధికారాలను ఉపయోగించుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’’ 
    – 2020 మార్చి 15న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌  

కేవలం రెండు నెలల వ్యవధిలో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన రెండు అంశాల్లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విచక్షణాధికారం ఆధారంగా వెలువడిన నిర్ణయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడానికి ఈ విచక్షణాధికారం ఉపయోగపడడం వెనుక ప్రతిపక్షం, ఆ పార్టీ అధినేత ప్రయోజనాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 
- స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపే విషయంపై శాసన మండలి చైర్మన్‌ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా తమ అధికారాలను ఉపయోగించడానికి రాజకీయ కారణాలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. 
- ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అరుదైన సందర్భాల్లో సంకట పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపయోగించాల్సిన విచక్షణాధికారం రాష్ట్రంలో విచక్షణ కోల్పోతోందనడానికి శాసన మండలి చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  
- శాసన మండలిలో చైర్మన్‌ షరీఫ్‌పై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా రెండు బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపేలా చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. చేస్తున్నది తప్పే అయినా తనకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి మండలి ౖచైర్మన్‌ షరీఫ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒత్తిడికి లొంగిపోయారని వారు విమర్శించారు. ఆరోజు మండలిలో షరీఫ్‌ చదివిన ప్రకటన కూడా టీడీపీ రాసిచ్చిందేనని వారు పేర్కొన్నారు. 
- ఎన్నికల కమిషనర్‌ సైతం తెలుగుదేశం పార్టీ అభిమతానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసినట్లు రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 
- స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన రోజు నుంచే చంద్రబాబు, టీడీపీ నాయకులు వాటిని ఇప్పుడు నిర్వహించడం సరికాదని వాదిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ఉందని, ఎన్నికల్ని వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్‌ను టీడీపీ నాయకులు పదేపదే కోరారు. 
ఒక పథకం ప్రకారం అక్కడక్కడా జరిగిన చిన్నచిన్న గొడవలపై రాద్ధాంతం చేసి భూతద్దంలో చూపించి ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ నాయకులు లేఖలు రాయడంతోపాటు నేరుగా వినతిపత్రాలు ఇచ్చారు. 
- టీడీపీ నాయకుల డిమాండ్‌కు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడం చూసి రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోయారు.  

తెర వెనుక ఏం జరిగింది?!
- ఆదివారం ఉదయం 10కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విలేకరుల సమావేశం ఉంటుందని ఎన్నికల సంఘం కార్యాలయం శనివారం రాత్రి 7 గంటలప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చింది. 
- రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ ఆదివారం జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కోసమేనని అధికారులు, మీడియా ప్రతినిధులు భావించారు. 
- నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం రాత్రంతా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలోనే బస చేశారు. కొన్ని రోజులుగా ఆయన కమిషన్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లోనే రాత్రి వేళలో కూడా ఉంటున్నారు. 
- షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం విడుదల చేయాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌కు సంబంధించిన కాపీలను ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్యాలయంలో పనిచేసే జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఒకరు రమేష్‌కుమార్‌ ఛాంబరుకు తీసుకెళ్లి ఇవ్వబోతే.. తర్వాత పిలుస్తానంటూ ఆ అధికారిని రమేష్‌కుమార్‌ వెనక్కి పంపారని తెలిసింది. 
- చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న, ఇటీవలి కాలం వరకు ఎన్నికల కమిషన్‌ ఇన్‌చార్జి కార్యదర్శిగా కొనసాగిన సత్య రమేష్‌ను ఆదివారం ఉదయం 9 గంటలకు రమేష్‌కుమార్‌ ప్రత్యేకంగా తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారని.. ఆయన హడావుడిగా కమిషనర్‌ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. 
- కొద్దిసేపు వీరిద్దరి మధ్య ఆంతరంగిక చర్చలు కొనసాగిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేత నోట్‌ను సత్యరమేష్‌ ఛాంబర్‌లో రహస్యంగా తయారు చేయించినట్లు తెలిసింది. 
- కమిషనర్‌ రమేష్‌కుమార్, జాయింట్‌ కమిషనర్‌ సత్యరమేష్‌ మధ్య ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చర్చలు జరుగుతున్న సమయంలో కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ గురించి మరోసారి రమేష్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా.. తాను చెప్పే వరకూ విలేకరుల సమావేశంలో ఈ నోటిఫికేషన్‌ వివరాలను ఇవ్వవద్దని ఆయన వారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 
- ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంలో ఐఏఎస్‌ అధికారి కమిషన్‌ కార్యదర్శి హోదాలో పనిచేస్తుంటారు. ఇన్‌చార్జి కమిషన్‌ కార్యదర్శి సత్యరమేష్‌ స్థానంలో నెలన్నర క్రితం రామసుందర్‌రెడ్డి అనే ఐఏఎస్‌ అధికారి నియమితులయ్యారు.  ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించే వరకు కమిషన్‌ కార్యదర్శి రామసుందర్‌రెడ్డికి కనీసం సమాచారం కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది.
- ఎన్నికల ప్రక్రియ నిలిపివేత..  ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది తొలగింపునకు సంబంధించి ఏం మాట్లాడాలన్నది రమేష్‌కుమార్‌ ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నారు. దానినే విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు.   

ప్రొసీజర్‌ ప్రకారం జరగాల్సిందిదీ.. 
- కరోనా ప్రభావంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని అంచనా వేయాలి. 
- శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రావాలి. 
- ఎన్నికల నిర్వహణ తీరు.. నిబంధనల ఉల్లంఘన..హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటే జిల్లాల ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులతో ప్రత్యేక నివేదికలు తెప్పించుకోవాలి. 
- వీటి ఆధారంగా పరిస్థితి అదుపు తప్పిందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలా? వాయిదా వేయాలా? అన్న అంశంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి.  
    ఇది నిపుణుల మాట.. కానీ ఇవేవీ జరిగిన దాఖలాలు లేవని వైఎస్సార్‌సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement