గుజరాత్‌లో వాయిదా .. రాష్ట్రంలో బేఖాతరు | Awe at trying for elections when 3000 cases are coming in a day | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో వాయిదా .. రాష్ట్రంలో బేఖాతరు

Published Thu, Nov 5 2020 3:38 AM | Last Updated on Thu, Nov 5 2020 5:08 AM

Awe at trying for elections when 3000 cases are coming in a day - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేసులు కొంత తగ్గుముఖం పట్టినా ఢిల్లీ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గుజరాత్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వాయిదా వేశారు. గుజరాత్‌తో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్‌లో ప్రస్తుతం రోజుకు వెయ్యిలోపు కేసులు నమోదవుతుంటే, మన రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు మూడు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇది పట్టించుకోకుండా స్థానిక ఎన్నికల విషయంలో మన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అవలంభిస్తున్న వైఖరిపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

అప్పుడు వాయిదావేసి ఇప్పుడు పట్టించుకోకుండా..
గుజరాత్‌లో 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలు, 55 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రస్తుత సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌ రెండో వారంతో ముగుస్తోంది. అయినప్పటికీ కరోనా వల్ల ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు వాయిదా వేసింది. 20 రోజుల క్రితమే అక్కడి ఎన్నికల కమిషనర్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2018 ఆగస్టు 1 నాటికే (రెండేళ్ల మూడు నెలల క్రితమే) గ్రామ పంచాయతీలు, జూలై 5వ తేదీ (ఏడాది నాలుగు నెలల కిత్రమే) నాటికే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా చంద్రబాబు, ప్రసుత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ హయాంలో ఇన్నాళ్లూ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్లు కూడా ముగిశాయి. అయితే కరోనా పేరుచెప్పి నిమ్మగడ్డ అర్ధంతరంగా ఎన్నికలు వాయిదా వేశారు. రోజుకు 2, 3కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేశారు. అలాంటిది ఇప్పుడు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు కమిషనర్‌ ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

వలస వెళ్లిన వారితో ముప్పు!
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగితే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లు గ్రామాలకు వస్తే, ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కరోనా విజృంభణకు అవకాశాలు ఉంటాయనే ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు తిరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఒకట్రెండు ఓట్లపై కూడా గెలుపోటములు ఆధారపడి ఉండే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు.. తమ ఓటర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా వారిని పోలింగ్‌ రోజుకల్లా రప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే జరిగితే ఉత్పమన్నమయ్యే పరిస్థితులను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement