ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ నవమి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నకాలంలో నవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించేది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేవారు.
ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. దీంతో వచ్చే మార్చి 28న నిర్వహించనున్న నవమి వేడుకలకు ఒంటిమిట్టలోని రామాలయాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. అయితే దీనికి సంబంధించి జీవో విడుదల కావాల్సి ఉంది.