రుణ ప్రణాళికేదీ...
జిల్లా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకూ రుణ ప్రణాళిక సిద్ధ్దం కానిది ఈ సంవత్సరమే. ఇప్పటికే అప్పుల పాలైన రైతులు రుణమాఫీ కారణంగా కొత్తగా అప్పులు బ్యాంకులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మరోవైపు అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం యద్దనపూడి మండలం చిమటవారిపాలెంలో జరిగిన రైతు ఆత్మహత్యే దీనికి ఉదాహరణ.
బాబు రోజుకో మాట ... నోటీసులతో బెంబేలు...
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ అసలు రుణమాఫీ ఎంతమందికి అమలవుతుందో లేదో తెలియని పరిస్థితి. రోజుకో నిబంధన, రోజుకో షరతులతో చంద్రబాబు ప్రభుత్వం కాలం గడిపేస్తోంది. తాజాగా బ్యాంకులకు జాబితాలు వచ్చాయి. అయితే ఆ జాబితాలు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. తాము పంపిన జాబితాలను పునఃపరిశీలించాలని, కొన్నింటిలో తప్పులున్నందున పూర్తిగా పరిశీలించి మళ్లీ పంపాలని వాటి సారాంశం. అవి ఎప్పటికి పూర్తవుతాయో? వాటిని ఎప్పుడు అమలు చేస్తారన్నది యక్షప్రశ్నలా మిగిలిపోయింది. మరో వైపు బ్యాంకుల్లో బంగారం కుదవపెట్టి రుణం తీసుకున్న వారందరూ రుణాలు చెల్లించాలని, లేనిపక్షంలో బంగారం వేలం వేస్తామని బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కొనకనమిట్లలో సిండికేట్ బ్యాంకు అధికారులు వేలం వేయనున్నట్లు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కందుకూరు యూనియన్ బ్యాంకు కూడా బంగారం రుణం తీసుకున్న వారికి వేలం నోటీసులు అందించింది. రుణమాఫీకి అర్హత ఉన్న ఖాతాలకు కూడా నోటీసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
వేల రూపాయల వడ్డీతో కట్టు
కందుకూరు వరపర్లవారిపాలేనికి చెందిన వరపర్ల మల్లికార్జున 2012 డిసెంబర్ 28న బంగారం కుదవపెట్టి లక్షా 55 వేల రూపాయలు పంటరుణంగా తీసుకున్నారు. ఇప్పుడు అది వడ్డీతో కలిపి 1,71,701 రూపాయలకు పెరిగింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లోగా చెల్లించకపోతే బంగారం వేలం వేయక తప్పదని ఈ నెల మూడోవారంలో నోటీసులు జారీ చేసింది. తనకు రుణమాఫీకి అర్హత ఉందని లక్షన్నర వరకూ రుణమాఫీ కావాల్సిన సమయంలో బ్యాంకులు నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని రైతు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పటికే చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ కారణంగా బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఈ ఏడాది రైతులకు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.
నిబంధనలతో భారీ కోత
జిల్లాలో మొత్తం వ్యవసాయ రుణాలు రూ.7 వేల కోట్ల వరకూ ఉన్నాయి. లక్షన్నర రుణపరిమితి పెట్టడం వల్ల మాఫీ అయ్యే రుణ మొత్తం ఐదు వేల కోట్లకు చేరింది. ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, పంట రుణాలకు పరిమితం చేయడం, రేషన్ కార్డు, ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలనే నిబంధనలతో రైతులకు అందే రుణమాఫీ మూడు వేల కోట్ల రూపాయలలోపే ఉంటుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసలు ఏ జాబితా నిజమైంది, ఏ జాబితా ప్రకారం రుణమాఫీ చేస్తారనే అనుమానాలు నివృత్తయ్యే పరిస్థితి కనపడటం లేదు.
వడ్డీతో కలిపి రుణ మొత్తంలో 25 శాతం చెల్లింపు...
తెలంగాణాలో చంద్రశేఖరరావు మొత్తం వడ్డీతో కలిపి రుణం ఎంతయిందో చూసి అందులో 25 శాతం చెల్లించేశారు. మిగిలినది కూడా వడ్డీతో సహా చెల్లిస్తామని, అయితే తాజాగా తీసుకున్న రుణాల వాయిదాలను సకాలంలో చెల్లించాలంటూ రైతులకు తహశీల్దార్లు రుణమాఫీ ఒప్పంద పత్రాలను కూడా అందజేశారు.
అక్కడ మాఫీలు ఇక్కడ నోటీసులు
Published Tue, Dec 2 2014 2:54 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement