సాక్షి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ సిక్కోలువాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత పాలకుల వివక్ష, వైఫల్యాలను అధిగమిస్తూ ఈసారి మెరుగైన కేటాయింపులు లభిస్తాయని ఆకాంక్షిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఉద్దానం కిడ్నీ సమస్యలు తదితరాలకు మోక్షం కలిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్‌షోర్ ఆశలు
రైతన్నలకు సాగునీరు అందించాలన్న గొప్ప ఆలోచనతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మహేంద్ర తనయా ఆఫ్ షోర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టు పనులకు గ్రహణం పట్టింది. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా.. ఎంతమంది అధికారులు బాధ్యతలు చేపట్టినా.. అనుకున్న పని పూర్తిచేయడంలో వెనుకబడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తగిన నిధులు కేటాయిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పలాస నుంచి ఇచ్చాపురం వరకు గల పంట పొలాలలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఒడిశాలో ప్రవహించే మహేంద్రతన నది నుంచి పాయగా విడదీసి అదే నది పేరుతో ‘మహేంద్రతనయా ఆఫ్‌సోర్ ప్రాజెక్టు’ నిర్మాణానికి 2008 ఏప్రిల్ 4న శంకుస్థాపన చేశారు. మొద ట అంచనాలకు మించిఅధికంగా బిల్లులు మంజూరై 2018 జూలై నాటికి సాగునీరు అందించాలని గడువు ఉన్నప్పటికీ 2019 జూలై వచ్చినా ఇంతవరకు పనులు పూర్తికాలేదు.
సర్కారుపై అదనపు భారం..
గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆఫ్‌షోర్ నిర్మాణ ప్రాంతంలో సుమారు 100 మీటర్లకు పైగా మట్టిపోత కొ ట్టుకుపోయింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో పిల్లగెడ్డ ప్రవహించేది. ప్రస్తుతం దీనిని కప్పివేయడంతో వరదలకు పిల్ల గెడ్డ కాస్త పెద్దదిగా మారి కొట్టుకుపోయింది. తిరిగి దీనిని నింపడానికి మరోసారి నిధులుకేటాయించాల్సి ఉంటుంది.
శాశ్వత పరిష్కారం దిశగా..
ఉద్దాన ప్రాంతంలోని ఏడు మండలాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందని ద్రాక్షలా ఉన్న బడ్జెట్ కేటాయింపులు ప్రస్తుత బడ్జెట్ ద్వారా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే తన హామీలను నెరవేర్చుకునే క్రమంలో డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు రూ.10000 పింఛన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకు తాగునీటి చర్యల నిమిత్తం ఏడాదికి కోటి రూపాయల నిధులు మంజూరుచేశారు.
ప్రధానంగా కవిటి, కంచిలి ఇచ్ఛాపురం, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస తదితర 7 మండలాల్లోని కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేకించి ఏడాదికి కోటి రూపాయల నిధులు తాగునీటి సౌకర్యాల కల్పనకు కేటాయింపులు చేయడం ఎంతగానో మేలు చేకూర్చనుంది. కిడ్నీవ్యాధుల నుంచి రక్షణకు భూగర్భజలాలకు బదులుగా ఉపరితల నదీజలాలను తాగునీరుగా అందిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ఈ సందర్భంగా నెరవేరేందుకు ఆస్కారం ఉంది. అంతేకాకుండా నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదీజలాలను తాగునీటి అవసరాలకు శుద్ధిచేసి గ్రామాలకు సరఫరా చేసే వీలు కలుగుతుంది.
పరిశుద్ధమైన ఉపరితల జలాలను తాగడం ద్వారా కిడ్నీవ్యాధుల నుంచి రక్షణ పొందే వీలుకలుగుతుందని నిపుణులు సైతం గతంలో సూచించిన సంగతి తెలిసిందే.రెండు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 60000 మంది ప్రాథమిక కిడ్నీవ్యాధిబారిన పడిన వారితో పాటు అదనంగా ఐదులక్షల మంది సాధారణ ప్రజలకు సైతం ఉపరితల నదీజలాలు శుద్ధిచేసి తాగునీరు అందించే అవకాశముంటుంది.అంతేకాకుండా ఉద్దానం కిడ్నీవ్యాధులకు కారణాలు అన్వేషించేందుకు పరిశోధనలకు ఊతమిచ్చేందుకు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకుసైతం ఈ బడ్జెట్‌లో రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితమైన విజన్‌తో ముందుకుసాగుతున్న తీరు ఉద్దానం కిడ్నీబాధితులకు వరమే అవుతుంది.
వంశ‘ధార’ కురవాలి
జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది కుటుంబాలకు తాగునీరు అందించే వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులకు నిధులు కేటాయించడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎంతో చేస్తున్నట్లు మాటలు చెప్పినప్పటికీ నిధులు కేటాయింపులో మొండిచెయ్యి చూపించారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి తగిన నిధులు కేయించకపోవడంతో గడిచిన ఐదేళ్లు నిర్మాణం పనులు నత్తనడకన సాగాయి. అరకొరగా నిధులు విడుదల చేసినప్పటికీ ఆ నిధులతో పనులు చేయకుండా కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న అధికార పార్టీ నాయకులే కొల్లగొట్టుకుపోయారని విమర్శలు లేకపోలేదు.
10 వేల ఎకరాల వీస్తీర్ణంలో 19 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు నిధులు అవసరం ఉంది. నిర్వాసితులైన వేలాది కుటుంబాలకు ఆదుకునేందుకు నిధులు కేటాయింపు జరుగుతుందని నిర్వాసితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణం పనులు చేస్తున్న సందర్భంలో గత పాలకులు నిర్వాసితులను భయపెట్టి, అక్రమ కేసులు నమోదు చేసి బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయించారు. గత పాలకుల నిర్లక్షానికి ఇప్పుడు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment