చెన్నైలో నర్సయ్యకు పింఛన్ నగదు అందజేస్తున్న వలంటీర్ చిట్టిబాబు , ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగి ఎ.నాగేశ్వరరావుకు పింఛను అందిస్తున్న వలంటీర్ నాగూర్‌బాబు
చీరాల/వెలిగండ్ల: అనారోగ్యంతో బాధపడుతూ పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు కూడా వలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు వెళ్లి నేరుగా పింఛన్ అందజేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల 21వ వార్డు బోస్‌నగర్‌కు చెందిన ఎ.నాగేశ్వరరావు వృద్ధాప్య ఫించన్ లబ్ధిదారుడు. ఆయన కొద్ది నెలలుగా క్యాన్సర్‌తో భాదపడుతూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు పింఛన్ ఇచ్చేందుకు వలంటీర్ ఎస్.కె.నాగూర్‌బాబు, వెల్ఫేర్ సెక్రటరీ తోట పూర్ణచంద్రరావు సోమవారం చీరాల నుంచి 60 కి.మీ. మంగళగిరి వెళ్లి ఆస్పత్రిలో నాగేశ్వరరావుకు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ రూ.4,500 అందించారు. కాగా, వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం పరిధిలోని పద్మాపురం వలంటీర్ జి.చిట్టిబాబు తన సొంత ఖర్చులతో 360 కి.మీ. దూరంలో ఉన్న చెన్నై వెళ్లి సోమవారం ఆపరేషన్ చేయించుకున్న ఓ వృద్ధుడికి వృద్ధాప్య పింఛన్ అందజేశాడు. పద్మాపురం గ్రామానికి చెందిన గూడూరి నర్సయ్య షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పద్మాపురం వలంటీర్ చిట్టిబాబు సోమవారం చెన్నై వెళ్లి నర్సయ్యకు వృద్ధాప్య పింఛన్ అందజేశాడు.
93.67 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
సాక్షి, అమరావతి: వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ సోమవారం కూడా కొనసాగింది. మార్చి నెలకు సంబంధించి సోమవారం రాత్రి 8 గంటల వరకు 55,07,098 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. రూ.1,476.38 కోట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఆది, సోమవారాల్లో కలిపి 93.67 శాతం పంపిణీ పూర్తయింది.
ఒకే రోజు 51.50 లక్షలు
ఒక్క రోజులో 51.50 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం మీడియాకు తెలిపారు. ప్రభుత్వం 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తోందని, గత ప్రభుత్వం కంటే ఇది ఎన్నో లక్షలు ఎక్కువని తెలిపారు. గతంలో కంటే లక్షలాది మంది కొత్తవారికి పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తుంటే.. ఈ ప్రభుత్వం తగ్గించేస్తోందని లోకేశ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment