విశాఖ గ్యాస్‌లీక్‌: ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి! | AP Government monitoring Vizag Gas Leak area every moment | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి!

Published Sat, May 9 2020 3:31 AM | Last Updated on Sat, May 9 2020 11:31 AM

 AP Government monitoring Vizag Gas Leak area every moment - Sakshi

మొన్నటి వరకూ ప్రశాంతంగా కనిపించిన ఆ ప్రాంతం.. ఇప్పుడు విషవాయువు కారణంగా నిర్జీవంగా మారిపోయింది.. ప్రాణాలతో పాటు పర్యావరణాన్నీ కాటేసింది..ఇంతలా విశాఖని వణికించిన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో ఏం జరిగింది? విషాదానికి కారణమైన ట్యాంక్‌ వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? షికార్లు చేస్తున్న పుకార్లు చెప్పేవి నిజమేనా?మళ్లీ ఆ ట్యాంక్‌ నుంచి ప్రాణాలు పిండేసేలా విషవాయువు లీకవుతోందా.. ప్రభుత్వం చెప్పినట్లుగా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులో ఉందా? ఎల్‌జీ పాలిమర్స్‌లో వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

మళ్లీ గ్యాస్‌ లీకవుతోంది.. ప్రజలు భయపడుతున్నారు.. పేలిపోయే ప్రమాదం ఉందని అక్కడి పోలీసులు, అధికారులు చెబుతున్నారు. ఇలా సోషల్‌ మీడియాలో గురువారం అర్ధరాత్రి ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన వదంతులు వచ్చిన నేపథ్యంలో.. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్లాంట్‌ని ‘సాక్షి ప్రతినిధి బృందం’ శుక్రవారం ఉ.10.30 గంటలకు పరిశీలించింది. ఆ సమయంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్‌.. సంస్థ ప్రతినిధులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృంద ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బయట వినిపిస్తున్న వదంతుల మాదిరిగా అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా లేదని నిర్థారించారు. సాక్షి పరిశీలనలో అక్కడ కనిపించిన వాస్తవాలివీ..
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం

ఈ ట్యాంక్‌తోనే అసలు సమస్య.. 
ఇక ప్రమాదం జరిగిన ట్యాంకర్‌ పక్కనే కొత్తగా ఏర్పాటుచేసిన మరో ట్యాంక్‌ ఉంది. ఇందులో 3 వేల  టన్నుల స్టైరీన్‌ మోనోమర్‌ నిల్వలున్నాయి. ఈ ట్యాంక్‌ని చూసే అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే.. లీకవుతున్న సమయంలో ఏ చిన్నపాటి పేలుడు సంభవించినా మొదటి ట్యాంక్‌లో కన్నా రెండో ట్యాంక్‌లో పెద్ద మొత్తంలో స్టైరీన్‌ ఉంది కాబట్టి.. తీవ్రత 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించే ప్రమాదం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. అయితే.. మొదటి ట్యాంక్‌లో ప్రమాదం జరిగిన వెంటనే  రెండో ట్యాంక్‌ ఉష్ణోగ్రతలపై దృష్టిసారించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్యాంక్‌ సేఫ్‌జోన్‌లో ఉంది.

ప్రభావం కొంత ఎత్తు వరకే.. 
స్టైరీన్‌ మోనోమర్‌ వాయువు బరువైనది. ఈ కారణంగా ప్రమాద తీవ్రత కొంత ఎత్తు వరకూ మాత్రమే ఉంది. పైకి వెళ్లేకొద్దీ.. వాయువు ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందనేది సమీపంలో ఉన్న చెట్లు చూస్తే స్పష్టమవుతోంది. కంపెనీలో కింద ఉన్న పచ్చని పచ్చిక మొత్తం మాడిపోయింది. చిన్నచిన్న మొక్కల పరిస్థితీ అంతే. కానీ.. పెద్దపెద్ద చెట్ల పైభాగంలో ప్రభావం మాత్రం తక్కువగానే ఉంది. నాలుగు నుంచి 5 మీటర్ల వరకు మాత్రమే చెట్లు ఆకులు రంగు మారాయి. పైభాగంలో పచ్చగానే కనిపిస్తున్నాయి. 

యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు 
ఎల్‌జీ పాలిమర్స్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, పోలీసులు చమటోడుస్తున్నారు. ప్రమాద తీవ్రత తెలిసినా ఏమాత్రం లెక్క చేయకుండా పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఫోమ్‌ చల్లుతూ పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వదంతులని సృష్టించొద్దనీ.. రెండ్రోజుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది.

ఇదే ఆ ట్యాంక్‌..
12 మందిని పొట్టన పెట్టుకుని.. వందల మందిని ఆస్పత్రి పాల్జేసిన దుర్ఘటనకు కారణమైన స్టైరీన్‌ మోనోమర్‌ విషవాయువు లీకైంది ఈ ట్యాంక్‌ నుంచే. 2,500 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ ట్యాంక్‌లో ప్రమాదానికి ముందు 2 వేల టన్నుల స్టైరీన్‌ గ్యాస్‌ ఉంది. 25 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దీన్ని నిల్వ ఉంచాలి. కానీ.. లాక్‌డౌన్‌ కారణంగా నిల్వలు పెరిగిపోవడంతో.. లోపల ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరిగింది. ఫలితంగా పీడనం పెరిగి వాయు రూపంలో లీకైంది. ప్రమాదం జరిగిన రాత్రే దీన్నుంచి స్టైరీన్‌ని వేరే ట్యాంక్‌లోకి మళ్లించాలని ప్రయత్నించినా విఫలమయ్యారు. అది పెను ప్రమాదానికి దారితీస్తుందనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఇందులోకి హైడ్రాలిక్‌ ఫైర్‌ టెండర్స్‌ ద్వారా యాంటీ డోస్‌ పంపించారు. ఫలితంగా.. ఒత్తిడి 90 శాతం వరకూ తగ్గింది. ప్రస్తుతం అతి స్వల్పంగా మాత్రమే లీకేజీ జరుగుతోంది. అయితే.. ఇలాంటి లీకేజీలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.. 
గురువారం నాటి ప్రమాద తీవ్రతకు పశుపక్ష్యాదులు మృత్యువాత పడ్డాయి. కానీ.. శుక్రవారం మాత్రం విషవాయువు లీకైన ట్యాంక్‌ పక్కనే పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అంటే.. ప్రమాద తీవ్రత లేదని స్పష్టంగా కనిపిస్తోంది.

పేలుడు సంభవించే పరిస్థితిలేదు
ట్యాంక్‌లో ఉన్న స్టైరీన్‌ మోనోమర్‌.. పరిమాణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఎలాంటి పేలుడూ సంభవించే పరిస్థితులు కనిపించడంలేదు. ట్యాంక్‌లో రియాక్షన్‌ కూడా తగ్గుతూ వస్తోంది. శనివారం ఉదయానికల్లా పరిస్థితి పూర్తి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం. 
– డా. జార్జ్, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధి

హైడ్రాలిక్‌ ఫైర్‌ టెండర్స్‌ ద్వారా యాంటీ డోస్‌
ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్‌ ట్యాంక్‌ల వద్దకు మా ఫైర్‌ సేఫ్టీ బృందం వెళ్లింది. అయితే.. అప్పటికే లీకైన వాయువు గేట్‌ వరకూ వ్యాపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లలేకపోయారు. వెంటనే స్ప్రింక్లర్‌ సిస్టమ్‌ని 4 గంటలకు ఓపెన్‌ చేశాం. ఇందులో యాంటీ డోస్‌ని 4.30 గంటల నుంచి యాడ్‌ చేసి నీటిని స్ప్రింక్‌ చేశాం. హైడ్రాలిక్‌ ఫైర్‌ టెండర్స్‌ ద్వారా ట్యాంక్‌లోకి యాంటీ డోస్‌ సరఫరా చేశాం. ప్రస్తుతం వాతావరణంలో లీకైన విషవాయువు ప్రభావంలేదు.
– రమేష్‌ పట్నాయక్, ఎల్‌జీ పాలిమర్స్‌ సేఫ్టీ ఏజీఎం 

ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం...
ప్రస్తుతం ప్లాంట్‌లో పరిస్థితి అదుపులో ఉంది. ఎలాంటి ప్రమాద సూచనలూ కనిపించడంలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా.. 9 నుంచి 10 గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. ప్రమాద స్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటున్నాం.    
– ఉదయ్‌భాస్కర్, డీసీపీ–2 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement