డీఏ 5.992%
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
జూలై నుంచి వర్తింపు.. కొత్త రాష్ట్రంలో ఇదే తొలి పెంపు
పెరిగిన భత్యాన్ని 1న అక్టోబర్ జీతంతో అందుకోనున్న ఉద్యోగులు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ) 5.992 శాతం పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాష్ట్రంలో డీఏ పెంపు ఉత్తర్వులు ఇవ్వడం ఇదే తొలిసారి. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 71.904 శాతం నుంచి 77.896 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి పెంపు వర్తిస్తుంది. తాజా పెంపు మేరకు డీఏను నవంబర్ 1న ఇవ్వనున్న అక్టోబర్ జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. జూలై నుంచి సెప్టెం బర్ వరకు 3 నెలల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులకు ఎస్‌పీఎఫ్(స్టేట్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాల్లో వేయనున్నారు.
2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి డీఏ బకాయిల్లో 10 శాతం ‘చందాతో కూడిన పెన్షన్’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతా లో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 179.922 శాతం నుంచి 191.226 శాతానికి పెంచనున్నారు.
1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులకు 186.504 శాతం నుంచి 196.32 శాతానికి డీఏ పెరగనుంది.
ఐదో జుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జుడీషియల్ అధికారుల డీఏ 200 శాతం నుంచి 212 శాతానికి పెరగనుంది.
ఈ.పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జుడీషియల్ అధికారుల డీఏ 100 శాతం నుంచి 107 శాతానికి పెరగనుంది. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ. 100 పెరగనుంది. డీఏ బకాయిల వివరాలను నిర్ధారిత ప్రొఫార్మాలో ఉద్యోగులు సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. పెన్షనర్లకు కూడా ఈ మేరకు కరవు భృతి(డీఆర్) పెరగనుంది.
పీఆర్సీ అమలు చేయాలి: ఉద్యోగులు
ధరలు మండిపోతున్న నేపథ్యంలో సగటు వేతన జీవులు అల్లాడిపోతున్నారని, వెంటనే పదో పీఆర్సీని అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు కోరుతున్నారు.