కరోనా అలర్ట్‌ : ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి | AP Government Request To People That Dont Come To Ap | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి వచ్చే ప్రయత్నాలు చేయొద్దు : ఏపీ ప్రభుత్వం

Published Thu, Mar 26 2020 12:10 PM | Last Updated on Thu, Mar 26 2020 12:24 PM

AP Government Request To People That Dont Come To Ap - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇత‌ర ప్రాంతాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని  ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేసింది. అలాగే ఏపీ నుంచి త‌మ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేయవ‌ద్ద‌ని సూచించింది. తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలనే ఆందోళన వద్దని, ఎక్కడివారు అక్కడే ఉండాల‌ని కోరింది. అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల‌ని విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికే రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించామ‌ని తెలిపింది. లాక్‌డౌన్‌ను ప్రజలంతా అర్థం చేసుకోవాల‌ని, ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంద‌ని పేర్కొంది. మరోవైపు పెద్దఎత్తున ఒకేసారి ప్రజలు రావడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.(కరోనా పాజిటివ్‌ కేసులు 10)

ఇతర ప్రాంతాల నుంచి రావడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలనే ఆలోచన వద్ద‌ని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఎవరు వచ్చినా చెక్‌పోస్టు వద్ద పరీక్షలు నిర్వహిస్తామ‌ని, త‌ప్పనిస‌రిగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. క్లిష్ట సమయంలో పౌరులు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ప్రభుత్వానికి సహకరించాల‌ని కోరింది. అంతరాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేశామ‌ని, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాన్ని వారు అర్థం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం యంత్రాంగం మరింత అప్రమత్తత ప్రకటించింది. (ప్రపంచ దేశాలపై కరోనా విలయ తాండవం)

ఏపీ ప్రభుత్వం ఆగ్ర‌హం
మ‌రోవైపు కొన్ని మీడియా చానళ్లు సృష్టిస్తున్న గందరగోళంపై ఏపీ ప్రభుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నంద్యాలలో ఉన్న తెలంగాణ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల‌ని సూచించింది. ఈ మేర‌కు సీఎం కార్యాలయ అధికారులు కర్నూలు కలెక్టర్‌తో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల అధికారులతో  సీఎంవో అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రా విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని ఏపీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను  కోరింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement