నేరాలపై ఉక్కుపాదం | AP Government Take Strict Action Against Crime | Sakshi
Sakshi News home page

రాజకీయ హింస తగ్గుముఖం.. 

Published Fri, Aug 2 2019 9:59 AM | Last Updated on Fri, Aug 2 2019 9:59 AM

AP Government Take Strict Action Against Crime - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నేరాల అదుపుతోపాటు, శాంతిభద్రతలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఆ దిశగా సమాయత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశంతో ప్రభుత్వ ప్రాథమ్యానికి తగ్గట్టుగా రక్షక భట యంత్రాంగం కార్యరంగంలోకి దిగింది. అసాంఘిక కార్యకలాపాలు, అన్ని రకాల నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమాజానికి రుగ్మతగా మారిన అనేక రకాల అరాచకాలను అరికట్టేందుకు పోలీసులు దాడులు విస్తృతం చేశారు. క్రికెట్‌ బెట్టింగ్‌లు, గాంబ్లింగ్‌ క్లబ్‌లు(పేకాట స్థావరాలు), గంజాయి, గుట్కా స్మగ్లింగ్‌లపై మెరుపుదాడులు తీవ్రతరమయ్యాయి. ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన ‘స్పందన’ను ప్రజలు కూడా బాగా వినియోగించుకుంటున్నారు. పోలీస్‌ స్టేషన్లకు వెళ్లడానికి భయపడే జనం ఇపుడు ఈ కార్యక్రమం ద్వారా తమకు జరిగే అన్యాయాలను చెప్పుకుంటున్నారు. పోలీసుల తక్షణ చర్యలతో చాలా ఫిర్యాదులకు పరిష్కారం లభిస్తోంది. కొత్త అంశాలు కూడా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి.

తక్షణం స్పందిస్తున్న పోలీసులు... 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు నేరాలపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. పోలీసులు దాడులు, నమోదు చేసిన కేసుల వివరాలను పరిశీలిస్తే ..నిషేదిత గుట్కాను రవాణా చేస్తున్న స్మగ్లర్లు, అమ్మకందార్లపై 888 కేసులు నమోదు చేసి 1,251 మందిని అరెస్టు చేశారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద 107 కేసులను నమోదు చేసి 325 మందిని అరెస్టు చేశారు. ఎక్సైజ్‌ చట్టం కింద 1,026 కేసులను నమోదు చేసి 1,147 మందిని జైలుకు పంపారు. పేకాట క్లబ్‌లపై వరుస దాడులు నిర్వహించి 3,180 కేసుల్లో 9,787 మంది జూదరులను కటకటాల వెనక్కు పంపారు. క్రికెట్‌ బుకీల స్థావరాలపై దాడులతో 205 క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులు నమోదయ్యాయి.  

‘స్పందన’లో చాలా సమస్యలు వెలుగులోకి.... 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ప్రతీ సోమవారం పోలీసు శాఖ చేపట్టిన స్పందన కార్యక్రమానికి బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని ఎస్పీల కార్యాలయాలు, నగర పోలీస్‌ కమిషనరేట్ల వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. గత నాలుగు సోమవారాల్లో నిర్వహించిన స్పందనలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,079 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. వాటిలో 9,791 ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంతో 97శాతం ఫిర్యాదులకు పరిష్కారం చూపినట్టు అయ్యింది. స్పందనలో ప్రధానంగా మహిళలపై నేరాలు, సివిల్‌ వివాదాలు, సెటిల్మెంట్లు, ఆస్థి సంబంధమైన గొడవలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసులు ప్రధానంగా వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్పందన ఫిర్యాదుల్లో సివిల్‌ వివాదాలు 1,900 (19శాతం), మహిళలపై నేరాలు 1,837 (15శాతం), ఆస్తిసంబంధమైన వివాదాలు 1,145 (8శాతం), వైట్‌ కాలర్‌ నేరాలు 873(4.7శాతం), కుటుంబ తగాదాలు 472 కేసులతోపాటు ఇతర నేరాలు(15శాతం) ఉన్నాయి. స్పందనలో అత్యధిక విజ్ఞాపనలు వచ్చి పరిష్కరించిన వాటిలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు రూరల్‌ జిల్లాలు ఉన్నాయి.  

‘కోడ్‌’ ఉల్లంఘనలో టీడీపీవారిపైనే ఎక్కువ కేసులు 
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు, దాడులు, ఘర్షణలు వంటి కేసులు... 2014లో టీడీపీకి చెందిన వారిపై 2,162 కేసులు, వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై 1,877 కేసులు నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి చెందిన వారిపై 2,049 కేసులు, వైఎస్సార్‌సీపీకి చెందిన వారిపై 2,038 కేసులు నమోదు చేశారు.
 
శాంతిభద్రతలపై రాజీ లేదు..డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ 
శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా గట్టి చర్యలు చేపట్టాం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ పలు నేరాల్లో మొదటి పది స్థానాల్లో ఉంది. దీనిపై ప్రధానంగా దృష్టి సారించాం. మహిళలపై నేరాలు, మానవ అక్రమ రవాణా, ఎస్సీ, ఎస్టీలపై దాడులు, సివిల్‌ సెటిల్మెంట్లు, సైబర్‌ క్రైమ్‌ రేటు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. నేరస్తులకు శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుమందు పెడతాం. తప్పు చేయడానికి అసాంఘిక శక్తులు భయపడేలా మా ప్రయత్నాలున్నాయ్‌. నేర నిరూపణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. త్వరలో ప్రతీ ఇంటికీ ఒక సీసీ కెమెరా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతాం. సమాజంలో ప్రజలు శాంతిభద్రతలతో జీవించేలా పోలీసులుగా మా వంతు కర్తవ్యాన్ని త్రికరణశుద్ధితో నిర్వర్తిస్తాం. 

రాజకీయ హింస తగ్గుముఖం.. 
రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తరువాత రాజకీయ హింస గణనీయంగా తగ్గింది. దాదాపు 31 శాతం రాజకీయ హింస తగ్గినట్టు పోలీసు అధికారులు లెక్కలు తేల్చారు. దీనికితోడు ఎన్నికలు, దాని అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను 2014తో పోల్చితే 2019లో 15శాతం తక్కువేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 2014లో మొత్తం 908, 2019లో 628 హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఎన్నికల ముందు 2014లో 345, 2019లో 198 సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌ సందర్భంగా 2014లో 276, అదే 2019లో 301 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల అనంతరం 2014లో 284 ఘటనలు, 2019లో 129 ఘటనలు జరగడం గమనార్హం. ఎన్నికల సమయమైన 2014 మే, జూన్‌ మాసాల్లో 3,874 కేసులు, అదే 2019 మే, జూన్‌ మాసాల్లో 3,323 కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సమయంలో గుంటూరు రూరల్‌లో 158 ఘటనలు, అనంతపురం జిల్లాలో 90, తూర్పుగోదావరి జిల్లాలో 87, కడప జిల్లాలో 60,  నెల్లూరు జిల్లాలో 54 ఘటనలతో వరుస స్థానాల్లో నిలిచాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement