సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అనిత నియామకంపై అటు ప్రజల్లో, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. గతంలో అనిత ఓ ప్రవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సైతం బయటకు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన లేఖ ఆధారంగా బోర్డ్ మెంబెర్ గా తొలగించినట్లు సర్కార్ పేర్కొంది.
మంత్రి పదవికోసం ఆశించిన అనితకు రెండుసార్లు జరిగిన కేబినెట్ విస్తరణలో ఆశాభంగం ఎదురైంది. దీంతో అనిత గత కొద్దికాలం పార్టీ కార్యక్రామాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయంపై పలుసార్లు ఎమ్మెల్యేను బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగానే టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల 20న జీవో జారీ చేసింది. అయితే అనిత నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి.
అనిత నియామకాన్ని సమర్ధిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎమ్మెల్యే సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. అంతేకాకుండా గతంలో ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని సైతం నెట్‌జన్లు బయటపెట్టడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో స్వచ్చందంగా తప్పుకోవాలంటూ అధిస్టానం ఇచ్చిన సూచన మేరకు అనిత తనను పాలకమండలి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అనిత సభ్యత్వం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment