మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: అటు సంక్షేమం... ఇటు అభివృద్ధి.. జోడు లక్ష్యాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం కలిగించేలా సంక్షేమ పథకాల విస్తృతి పెంచడంతోపాటు ఉద్యోగవర్గాల సమస్యలకు ముగింపు పలికేలా రాష్ట్ర సుస్థిర అభివృద్ధి దిశగా పలు తీర్మానాలను మంత్రిమండలి ఆమోదించింది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి మండలి సమావేశమైంది. ఈ వివరాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరులకు వివరించారు. ముఖ్యాంశాలు ఇవీ..
ఇక విద్యా వెలుగులు
అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేలా ‘జగనన్న విద్యాదీవెన’ పథకాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈసారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కోర్సులకు పూర్తిస్థాయిలో రీయింబర్స్‌మెంట్ అందజేస్తారు. ‘జగనన్న వసతి దీవెన’ పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ వసతి, భోజన సదుపాయాల కోసం నగదు చెల్లిస్తారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సంతృప్తస్థాయిలో విద్యార్థులకు ఈ రెండు పథకాలను అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
రెండు పథకాల కోసం రూ.5,700 కోట్లు
– విద్యార్థుల వసతి కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు ‘జగనన్న వసతి దీవెన’ కింద ఏటా రూ.2,300 కోట్లు ఇవ్వాలని నిర్ణయం.
– ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం గతంలో రూ.1,800 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ‘జగనన్న విద్యా దీవెన’ ద్వారా ఏటా రూ.3,400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
– జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.5,700 కోట్లు ఖర్చు చేయనుంది.
– జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి పథకాల ద్వారా గరిష్ట స్థాయిలో విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం.
– ప్రస్తుతం లబ్ధిదారులు 11,44,490 మంది ఉండగా అర్హత నిబంధనలు సడలించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
– గతంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు, మిగతా వర్గాలకు రూ.లక్ష లోపు ఉంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపచేస్తుండగా తాజాగా రూ.2.50 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న అన్ని వర్గాలకూ జగనన్న విద్యాదీవెన, జనగన్న విద్యా వసతి పథకాలను వర్తింపజేయాలని నిర్ణయించారు.
– పది ఎకరాలలోపు మాగాణి గానీ 25 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి (లేదా) మాగాణి, మెట్టా రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్నవారికి ఈ పథకాలు వర్తించేలా నిబంధనలను సడలించారు.
– పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు చెందిన వారికి ఆదాయంతో నిమిత్తం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది.
– కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నవారు కూడా ఈ పథకాలకు అర్హులే.
– ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకాలకు అనర్హులు.
– పట్టణాల్లో 1,500 చదరపు అడుగుల వరకు స్థిరాస్థి ఉన్నవారికీ ఈ పథకాలు వర్తిస్తాయి.
– పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదివే విద్యార్ధులందరికీ ఈ పథకాలు వర్తిస్తాయి.
‘వైఎస్సార్ కాపు నేస్తం’తో మహిళల ఆర్థిక స్వావలంబన
కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉప కులాల మహిళల జీవన ప్రమాణలు పెంపు, ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు మంత్రి మండలి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రకటించింది.
– వైఎస్సార్ కాపు నేస్తం పథకం కోసం ఈ ఏడాది రూ.1,101 కోట్లు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం.
– ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లపాటు రూ.75 వేలు ఆర్థిక సాయం.
– ఈ పథకం కోసం ఏటా రూ.900 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
– కాపుల సంక్షేమం కోసం ఏడాదికి మొత్తం రూ.2 వేలు కోట్లు కేటాయింపు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ... సీపీఎస్ రద్దు దిశగా కార్యాచరణ
ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్) రద్దు ప్రక్రియను వేగవంతం చేసే దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సంబంధిత అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారుల బృందం ఏర్పాటును ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే అధికారుల బృందానికి ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి మంత్రుల బృందానికి కమిటీ నివేదిక సమర్పించాలని గడువు విధించారు. సీపీఎస్ రద్దుపై నియమించిన మంత్రుల బృందానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా అధికారుల బృందాన్ని నియమించారు. ఈ బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. గతంలో టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా బృందం పరిశీలిస్తుంది. సీపీఎస్ రద్దుపై అధికారుల బృందం నివేదిక ఇచ్చేందుకు 2020 మార్చి 31ని గడువుగా నిర్ణయించారు.
ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
నవరత్నాల ద్వారా పేదలందరికీ ఇళ్ల పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుంది. కులం, వర్గం, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్షకు తావులేకుండా సంతృప్త స్థాయిలో అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.
బియ్యం కొత్త కార్డుల జారీ
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు అర్హులందరికీ కొత్తగా బియ్యం కార్డులు జారీ చేసేలా ప్రభుత్వం నిబంధనలను సడలించింది. బియ్యం కార్డుల అర్హతలను 2008 తరువాత సమీక్షించ లేదు.
– గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5 వేల లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డులు జారీ చేసేలా నిబంధనలు ఉండగా తాజాగా నెలకు రూ.10 లోపు ఆదాయం కలిగిన వారికి కూడా బియ్యం కార్డులు ఇచ్చేలా సడలించారు.
– గతంలో పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6,250 లోపు ఆదాయం ఉన్నవారికి బియ్యం కార్డులు జారీ చేసేలా నిబంధనలు ఉండగా తాజాగా దీన్ని నెలకు రూ.12 వేలకు పెంచారు.
– అర్హులైనప్పటికీ రేషన్ కార్డు దక్కని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి కొత్త కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.
– రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు.
కడప స్టీల్ ప్లాంట్ సాకారం
ఎన్నికల హామీని నెరవేరుస్తూ వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వతేదీన స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
– జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్ద నందలూరు గ్రామాల మధ్య స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు.
– ఇందుకోసం ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తుంది.
– స్టీల్‌ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూసేకరణకు క్యాబినెట్ ఆమోదించింది.
– స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కోసం ఎన్‌ఎండీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.
రూ.400 నుంచి రూ.4,000కి జీతాల పెంపు
గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ లైజన్ వర్కర్ల జీతాలను భారీగా పెంచేందుకు
మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నెలకు కేవలం రూ.400గా ఉన్న వారి జీతాలను రూ.4000కి ప్రభుత్వం పెంచింది. తద్వారా 2,652 మందికి లబ్ధి కలగనుంది. దీనిద్వారా అదనంగా రూ.14.46 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
బార్ల కుదింపు, ధరల పెంపునకు ఆమోదం
దశలవారీ మధ్య నిషేధంలో భాగంగా మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. 4,380 మద్యం షాపులను ఇప్పటికే 3,500కి తగ్గించడం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం మూసివేయాలని ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచారు. మద్యం షాపులు, బార్లలో వ్యాపార వేళలను కుదించారు. దీనికి సంబంధించి ఇటీవలే విధివిధానాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో బార్ల సంఖ్య తగ్గింపు, ధరల పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన పలు ఉత్తర్వులను ఆమోదిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదా బిల్లులను ఆమోదించింది. వీటిని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు.
క్యాబినెట్ భేటీలో మరికొన్ని నిర్ణయాలు
– ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్ల ఏర్పాటు బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.
–పాలనా సౌలభ్యం కోసం సదరన్ డిస్కం(ఏపీ ఎస్పీడీసీఎల్)ను రెండుగా విభజించాలని మంత్రి మండలి నిర్ణయించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో కొత్తగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(సెంట్రల్ డిస్కం) ఏర్పాటవుతుంది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు ఎస్పీడీసీఎల్ పరిధిలో కొనసాగుతాయి.
– ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
– ఏపీఐఐసీకి విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో 50 ఎకరాలను కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం ఈ భూమిని కేటాయించారు.
– నడికుడి – శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు 92.05 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
– ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇంటర్మీడియట్ విద్యను చేరుస్తూ ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది.
– టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలి ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment