సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్రంలోనే ఏకైక సంగీత, నృత్య కళాశాలగా ఖ్యాతి గడించిన విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల వందేళ్లు పూర్తిచేసుకుంటోంది. ఘంటసాల, పి. సుశీల వంటి గాయకులు సంగీత సాధన చేసిన కళాశాల శత వసంత వేడుకలను ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించాలని తలపెట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ.2 కోట్లు కేటాయించింది. కళాశాల ఆధునికీకరణకు రూ.1.38 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో వేడుకలు జరుపుతామని, జాతీయ, అంతర్జాతీయ కళాకారులను రప్పించి ప్రదర్శనలు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, ఇక్కడ జరుగుతున్నది వేరు.
‘కోటి’కి అవమానం
కళాశాల శతవసంతాల మూడు రోజుల ఉత్సవాల బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు కోటికి అప్పగించారు. ఇటీవల విజయనగరం, సాలూరులో ఆయనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి గంటా కోటితో చర్చించారు. ఒక మెగా ప్రొడ్యూసర్‌తో పాటు సాక్షాత్తూ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ బాధ్యతలను కోటి నిర్వహించాల్సిందిగా సూచించారు. ఆ నిర్మాత స్వయంగా కోటితో మాట్లాడారు. దీంతో దాదాపు పదిహేను రోజుల సమయాన్ని కేటాయించి కళాతపస్వి కె. విశ్వనాథ్, గాయని పి.సుశీలకు సన్మానంతో పాటు తాను, హరిహరన్, శోభన వంటి వారి కళా ప్రదర్శనలతో మూడు రోజుల కార్యాచరణను కోటి రూపొందించారు. కళాకారులందరి నుంచీ డేట్స్ కూడా తీసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖం చాటేశారు. కనీసం ఫోన్‌కి అందుబాటులో కూడా లేరు. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకున్న కళాకారులంతా అకస్మాత్తుగా కార్యక్రమం లేదనడంతో ఖంగుతిన్నారట. కోటి మాటను తీసేయలేక, అడ్వాన్సు కూడా తీసుకోకుండా ప్రోగ్రాంకు రావడానికి ఒప్పుకున్నందుకు ఇలా జరిగిందేమిటని వారంతా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్నట్లు సమాచారం.
లెజెండరీల ఊసేది
ఇదిలా ఉంటే.. ఉత్సవాలకు ఉపరాష్ట్రపతిని పిలుస్తున్నామని, సీఎం చంద్రబాబు తప్పనిసరిగా హాజరవుతారని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే ఏసుదాసు వంటి ఉద్ధండ గాయకులను రప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చెప్పారు. కానీ, ఇప్పుడు వీటిలో ఏ ఒక్కటీ జరగడంలేదు. ఉపరాష్ట్రపతిని పిలవాలంటే కనీసం నెల ముందైనా అనుమతి తీసుకోవాలి. అదీ జరగలేదు. ఇక ముఖ్యమంత్రి కూడా ‘బడ్జెట్’ నేపథ్యంలో రావడంలేదు. అలాగే, ప్రముఖ గాయకులెవరూ తమ ప్రదర్శనలిచ్చే అవకాశంలేదు. ఆఖరి రోజు శంకరాభరణం ఫేమ్ మంజుభార్గవి బృందం నృత్య ప్రదర్శన ఉంటుందని, గాయని పి.సుశీల ఆరోగ్యం సహకరిస్తే వచ్చే అవకాశం ఉందని మాత్రమే ఇప్పటివరకూ ఉన్న సమాచారంగా నిర్వాహకులు చెబుతున్నారు. పోనీ విద్వాంసులనైనా రప్పిద్దామంటే వారికి అడ్వాన్సుగా ఎంతోకొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.2 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉత్సవాలకు ఒకరోజు ముందు ముద్రించి తీసుకువచ్చిన మూడువేల ఆహ్వాన పత్రికలను ఎంతమందికి పంచుతారనే దానికి నిర్వాహకుల వద్ద సమాధానంలేదు. వందేళ్ల వైభవం వేళ ఈ పరిణామాలు కళాశాల ప్రతిష్టను మంటగలుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment