విద్యుత్ ‘షాక్’
చార్జీల మోతకు రంగం సిద్ధం
ఏటా రూ.70.8 కోట్ల భారం
4లక్షల మంది వినియోగదారులపై ప్రభావం
తిరుపతి రూరల్: మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా తన ముసుగును తొలగిస్తున్నారు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఆయన కొత్తగా విద్యుత్ చార్జీల మోత మోగించేందుకు రంగం సిద్ధం చేశారు. చార్జీల పెంపుతో జిల్లాలో నాలుగు లక్షల మంది వినియోగదారులపై ప్రతియేటా రూ.70.7 కోట్ల భారం పడనుంది. ఆ మేరకు సోమవారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ ప్రకటించారు.
జిల్లాలో 14,76,748 కనెక్షన్లు
జిల్లాలో 14,76,748 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహాలకు 10,74,508, వాణిజ్యం 92,340, పరిశ్రమలకు 11,062, చేతివృత్తుల పరిశ్రమలు 6,903, వ్యవసాయ కనెక్షన్లు 1,42,863, స్ట్రీట్ లైట్స్ 18,091, తాగునీరు 8,919, దేవాలయాలు 51, 1,062 హై టెన్షన్ విద్యుత్ కనె క్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతిరోజూ 11.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. నెలకు 354 మి.యూ విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
రూ.72 కోట్ల భారం
విద్యుత్ చార్జీల భారం అత్యధికంగా పారిశ్రామిక వర్గాలపైనే పడనుంది. జిల్లాలో ఈ కేటగిరీ కింద 1,062 మంది ఉన్నారు. ప్రతి నెలా 11.80 కోట్ల యూనిట్ల వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం యూనిట్‌పై 31 నుంచి 60 పైసల వరకూ పెరగనుంది. దీని ప్రకారం 45 పైసలు పెరిగినా నెలకు రూ.5.31 కోట్లు, ఏటా రూ.63.72 కోట్ల భారం పడనుంది. వాణిజ్య అవసరాల విభాగంలో 92,340 మంది వినియోగదారులున్నారు. ఈ విభాగంలో గత నెల 73.88 లక్షల యూనిట్లు వినియోగించారు. యూనిట్‌కు ప్రస్తుతం 46పైసల చొప్పున నెలకు రూ.33.98 లక్షలు, ఏటా రూ.4.08కోట్లు భారం పడనుంది. జిల్లాలో 200 యూనిట్లు వరకూ విద్యుత్‌ని వినియోగించే గృహ అవసరాల కనెక్షన్లు 12,163 ఉన్నాయి. ప్రతినెలా దాదాపు 71.54 లక్షల యూనిట్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేటగిరీపై 19 పైసలు మేర భారం మోపనున్నారు. అంటే నెలకు రూ.13.6 లక్షల చొప్పున ఏటా రూ.1.63 కోట్లు అదనపు భారం పడనుంది. కాటేజీ ఇండస్ట్రీస్ విభాగంలో జిల్లాలో 6,903 కనెక్షన్లు ఉన్నాయి.
ఈ విభాగంలో గత నెల 21.78 లక్షల యూనిట్ల వినియోగం జరిగింది. ప్రస్తుతం 16 నుంచి 50 పైసల వరకూ భారం పడనుంది. అంటే నెలకు రూ.8.71 లక్షలు, ఏటా రూ. 1.04 కోట్లు వాత పడనుంది. మరో కేటగిరీ కింద జిల్లాలో 2.63 లక్షల మంది వినియోగదారులున్నారు. నెలకు 62,345 యూనిట్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రూ.5.4 చొప్పున వసూలు చే స్తుండగా తాజాగా రూ.5.72కు పెరగనుంది. యూనిట్‌కు 32పైసలు పెరిగితే ఏటా రూ.2.39 లక్షలు భారం పడనుంది. అంటే పారిశ్రామిక, వాణిజ్య, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులపై ఏటా రూ.70.7 కోట్ల భారం పడుతుంది.