సాక్షి, అమరావతి: రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కనీస మద్దతు ధర చెల్లించి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వ్యాపారులు నిత్యావసరాల రేట్లను పెంచకుండా జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించిన ధరలకే విక్రయాలు నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. గ్రామ సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలు, పంట ఉత్పత్తుల రవాణా, విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. కౌంటర్‌కు తిరుగు సమాధానం ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వ కౌంటర్‌లోని ముఖ్యాంశాలు
► అర్హులందరికీ నిత్యావసరాలు అందించేలా ప్రభుత్వం బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తోంది. రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేస్తోంది.
► వ్యవసాయ ఉత్పత్తులతోసహా నిత్యావసర సరుకులు తరలించే వాహనాలు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతులిచ్చాం.
► కనీస మద్దతు ధర చెల్లించి పొలాల వద్దే జొన్న, మొక్కజొన్న, కంది, శనగ, పసుపు తదితర పంటలను కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటివరకు 460 మెట్రిక్ టన్నుల టమోటా, 7వేల మెట్రిక్ టన్నుల అరటి పళ్లను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ–కొనుగోళ్లు కూడా చేపడతాం.
► ఇప్పటివరకు 419 వికేంద్రీకరణ రైతు బజార్లు, 502 సంచార రైతు బజార్లు ఏర్పాటు చేశాం. కూరగాయల డోర్ డెలివరీని కూడా ప్రోత్సహిస్తున్నాం.
► రైతులు, వినియోగదారులు, ప్రజలు ఇబ్బందులను పరిష్కరించేందుకు 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
► ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
రైతులను ఆదుకుంటున్నాం
Published Thu, Apr 23 2020 3:58 AM | Last Updated on Thu, Apr 23 2020 3:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment