సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నేరం రుజువై జైలుశిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్‌రెడ్డిని తానే విడిపించానని పులివెందుల టీడీపీ అభ్యర్థి ఎస్‌వీ సతీష్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నేరగాళ్లకు అండగా నిలుస్తున్నారని స్పష్టమవుతోంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. చట్టంలో ఉన్న అవకాశాలను వాడుకుని పాలకపక్షానికి చెందిన వారికి మాత్రమే క్షమాభిక్ష పెట్టడం, టీడీపీ నేతలు, వారి అనుచరులపై ఉన్న కేసులను ఎత్తివేయడం వంటి అడ్డుగోలు పనులకు చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు.
టీడీపీ నేతలకే క్షమాభిక్ష
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులను క్షమాభిక్ష పేరుతో జైళ్ల నుంచి బయటకు తీసుకొస్తున్నారు. పలు నేరాలు నిరూపణ కావడంతో కోర్టులు విధించిన శిక్షాకాలం పూర్తికాకుండానే టీడీపీకి చెందిన వారికే క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు. ఘనతంత్ర దినోత్సవం పేరుతో 49 మందికి క్షమాభిక్ష పెడుతూ 2018 జూన్ 8న చంద్రబాబు ప్రభుత్వం జీవో నెం.75 జారీ చేసింది. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయి రాగిపిండి సుధాకర్‌రెడ్డితోపాటు మరో 48 మందిని ఇలా క్షమాభిక్ష పేరుతో జైలు నుంచి విడుదల చేసారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా మరో 32 మందిని విడుదల చేయాలని కొద్ది రోజుల క్రితం టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాస్తవానికి వృద్ధాప్యం, మహిళలు, సత్ప్రవర్తన వంటి కారణాలతో క్షమాభిక్ష పెట్టినట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ వారిలో వృద్ధులు ఇద్దరు మాత్రమే ఉండగా, నలుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. మిగిలిన వారంతా 33 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగినవారే. టీడీపీకి అనుకూలంగా ఉండే వారిని గుర్తించి ఎన్నికల వేళ విడుదల చేసేలా క్షమాభిక్ష అవకాశాన్ని వాడుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణ
తెలుగుదేశం పార్టీ నేతలపై ఉన్న పాత కేసులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 160కి పైగా జీవోలను జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రజా జీవనానికి భంగం కలిగించడం తదితర సెక్షన్ల కింద గతంలో టీడీపీ నాయకులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తేసింది. పోలీస్ రికార్డుల్లో మగ్గుతున్న వాటిని, కోర్టు విచారణలో ఉన్న కేసులను సైతం ఉపసంహరించుకునేలా జీవోలు జారీ చేయడం గమనార్హం. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి ఏడాది నుంచే టీడీపీ నేతలపై కేసులకు చెల్లుచీటి రాయడం మొదలైంది. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను ఎత్తివేశారు.
టీడీపీ నేతలపై కేసుల వివరాలు
- మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరికొందరిపై ఇబ్రహీంపట్నం, విజయవాడ పటమట, భవానీపురం, గన్నవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన ఐదు కేసులను ఎత్తివేస్తూ 2015 జూన్ 4న జీవో నెంబర్ 647ను ప్రభుత్వం జారీ చేసింది.
- మంత్రి కొల్లు రవీంద్రపై రాబర్డ్‌సన్‌పేట పోలీస్ స్టేషన్, ఇనకుదురు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ 2017 మే 3న జీవోలు నం.361, 362, 363 జారీ చేశారు.
- అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మరికొందరిపై నరసరావుపేట–1 పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల్లో విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 9న జీవో 664 జారీ చేశారు.
- ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఉన్న కేసును ఉపసంహరించుకుంటూ కోర్టుకు నివేధించాలని 2017 మార్చి 10న జీవో 192ను ప్రభుత్వం జారీ చేసింది. ఆయనపై ఉన్న మరో కేసు విచారణ నుంచి తప్పిస్తూ 2016 సెప్టెంబర్ 14న జీవో నం.681 ఇచ్చారు.
- శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరో 33మందిపై రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 ఫిబ్రవరి 27న ప్రభుత్వం జీవో జారీ చేసింది.
- కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విచారణ నుంచి మంత్రి అచ్చెన్నాయుడు మరో ఆరుగురిని మినహాయిస్తూ ప్రభుత్వం 2015 జూన్ 23న జీవో 704 జారీ చేసింది.
- మంత్రి గంటా శ్రీనివాసరావుపై అనకాపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ప్రభుత్వ ఆస్తుల ద్వంసం కేసు విచారణ నుంచి తప్పిస్తూ ప్రభుత్వం 2016 మార్చి 4న జీవో 143 జారీ చేసింది.
- ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మరో 20 మందిపై ఉన్న ఆస్తుల ధ్వంసం కేసును ఉపసంహరించుకుంటూ 2017 మే 9న ప్రభుత్వం జీవో 379 ఇచ్చింది.
- మంత్రి నక్కా ఆనందబాబు మరో నలుగురిపై వేమూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును ఎత్తివేస్తూ 2017 ఫిబ్రవరి 7న జీవో 97 జారీ చేశారు.
- ముఖ్యమంత్రి వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మరో 15 మందిని ఓ కేసు విచారణ నుంచి మినహాయిస్తూ 2016 సెప్టెంబర్ 14న ప్రభుత్వం జీవో 679 జారీ చేసింది.
- తూర్పుగోదావరి జిల్లా అమలాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎ.ఆనందరావు మరో ఏడుగురుపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసును ఎత్తివేస్తూ 2017ది మార్చి 28న జీవో 261 జారీ చేశారు.
- ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ వివేకానంద, మరో 21 మందిని ఓ కేసు విచారణ నుంచి తప్పిస్తూ 2016 ఏప్రిల్ 21న జీవో 278 జారీ చేశారు.
- అనంతపురం జిల్లాలో నమోదైన కేసుల్లో అప్పటి ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యర్రబెల్లి దయాకర్‌రావు, రంగనాయకులు, బీసీ గోవిందప్ప, మెట్టు గోవిందరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, హరీశ్వర్‌రెడ్డి, బాబు రమేష్, పడాల అరుణ, లలిత కమారి, అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరావు, వై.రాజేంద్రప్రసాద్, మసాల పద్మజ, చిన్నరాజప్పలతోపాటు మరో నలుగురిని విచారణ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న జీవో 907 జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment