సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమరరాజ్ ఇన్‌ఫ్రా టెక్‌కు చిత్తూరు జిల్లాలో యాదమరి మండలం మజరా కొత్తపల్లి, బంగారుపాళెం మండలం నేనుగుండ్లపల్లి గ్రామాల పరిధిలో సెజ్ ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని సర్కార్ కేటాయించింది.
ఆ సంస్థకు భూకేటాయింపు సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండేళ్లలోగా ఆ భూమిని ఉపయోగించుకోవాలి. కానీ.. సెజ్ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్‌ఫ్రా టెక్ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది. (రామాయపట్నంపై జపాన్ సంస్థల ఆసక్తి)
Comments
Please login to add a commentAdd a comment