
ఏపీకి ఇవ్వాల్సినవి ఇస్తున్నాం
- విభజన చట్టంలో హామీల అమలుకు కాస్త టైం పట్టొచ్చు
- చంద్రబాబు విమర్శలను సమర్ధించను, తప్పుపట్టను
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన అన్ని నిధులనూ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర అవసరాలతో పోల్చితే కేంద్రం ఇస్తున్న నిధులు తక్కువగా కనిపించి ఉండొచ్చన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పలువురు నేతలతో కలసి శనివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో హామీల అమలుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు.
కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టొచ్చన్నారు. దీనిపై ఏపీకి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు కొనసాగుతాయని తెలిపారు. తన వంతుగా ఆయా చర్చల విషయాలను సీఎం చంద్రబాబుకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రయత్నాలపై బాబుకు అవగాహన ఉందన్నారు. నిధుల కేటాయింపుపై చంద్రబాబు చేసిన విమర్శలను తాను సమర్ధించడం లేదని అలాగే తప్పుపట్టడమూ లేదని సీతారామన్ అన్నారు.
కేంద్రానికి వివక్ష లేదు
తెలంగాణ విషయంలోనూ కేంద్రం ఎలాం టి వివక్షా చూపబోదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడే అంశాల్లో తప్ప రాష్ట్రాలకిచ్చే వాటాల్లో ఎలాంటి తేడా ఉండదన్నారు. 13వ ఆర్థిక సంఘం సమయంలో రాష్ట్రాలకిచ్చే 32 శాతం నిధులు, 14వ ఆర్థిక సంఘంలో 42 శాతానికి పెంచడం వల్ల కేంద్ర ఆదాయ వనరులు తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో అమలు చేయాల్సిన పథకాలపై తాను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నానన్నారు.
తెలంగాణలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటుపై టీ ప్రజా ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, దీనికి సంబంధించి కేంద్ర అధికారులు రాష్ట్రంలో పర్యటించి స్థల పరిశీలన కూడా చేశారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ధాన్యం లెవీ విధానంలో వచ్చే ఏడాది నుంచి ఎలాంటి మార్పులూ ఉండబోవని తెలిపారు. రాష్ట్రాలు తమకు తామే ధాన్యం సేకరించుకోడానికి ముందుకొస్తే ఆ రాష్ట్రంలో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని.. మిగిలిన రాష్ట్రాల్లో ఎఫ్‌సీఐ కొనుగోళ్లు యథావిధిగానే కొనసాగుతాయని చెప్పారు. నల్లధనాన్ని రప్పించడంపై మోదీ ప్రభుత్వం పురోగతి సాధిస్తూనే ఉందన్నారు.