సాక్షి, అమరావతి : ఏపీ శాసన మండలిలో రూల్ 71పై ఓటింగ్ సందర్భంగా టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు గట్టి షాక్ ఇచ్చారు. ఓటింగ్‌లో సొంత పార్టీకే వ్యతిరేకంగా ఓటు వేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71కి వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి ఓటేశారు. రూల్ 71కి అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా.. 9 మంది తటస్థంగా ఉన్నారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు 32మంది ఉండగా.. ఇద్దరు సొంతపార్టీకే వ్యతిరేకంగా నడుచుకున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరయ్యారు. ఓటింగ్ అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులపై రేపు మండలిలో చర్చ జరగనుంది.
కాగా మంగళవారం ఉదయం నుంచి 71రూల్‌పై చర్చించాలని టీడీపీ పట్టుపట్టింది. ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా గందరగోళం సృష్టించింది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఛైర్మన్ రూల్ 71పై చర్చకు అనుమతించారు. ఓటింగ్ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment