సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రేపు (శనివారం) విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈవీఎంలపై పూర్తిస్థాయి విశ్వాసముందని, కానీ ఈసారి ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు, మున్సిపల్ ఎన్నికలు కూడా అదే పద్దతిలో నిర్వహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. అలాగే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశమైనట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ హేతుబద్దంగా ఉంటుందన్నారు. సింగిల్ డెస్క్ విధానం ప్రకారం ఎన్నికల ప్రచారానికి, సభలకు అనుమతి ఇవ్వాలని కోరారు. (ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు)
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని, పాత పత్రాలు ఉన్నా అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అభ్యర్థులపై అనర్హత వేటు కూడా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎన్నికలు సిబ్బంది సరిపోతారని, అవసరమైతే గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా వినియోగిస్తామని చెప్పారు. ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని పలువురు ఈసీ దృష్టికి తీసుకువచ్చారని, అయితే ఎన్నికల నిర్వహరణకు ఎలాంటి ఇబ్బంది లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కాగా ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను ఎన్నికల ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment