సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొంది. రమేష్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్‌లో పేర్కొన్న ప్రధాన ఆంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించలేదని.. ఇది ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీం తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం ఉంటుందని, ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం ఇస్తుందని ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను కనీసం వారిని సంప్రదించకుండా ఆపడం తగదని, దాంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. (హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్)
మరోవైపు ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా ఎన్నికల ప్రక్రియ ఈనెల 31లోగా ముగించకపోతే.. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లకు పైగా రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్ణయంపై న్యాయపోరాటానికి దిగింది. (ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ)
Comments
Please login to add a commentAdd a comment