సాక్షి, తాడేపల్లి: రైతుల్ని కరోనా పేరుతో భయానికి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. కరోనా సాకు చూపించి రైతుల పండించిన పంటలు, పళ్ల ధరలు తగ్గించే పని చేస్తే తీవ్రంగా చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా ప్రభావం, దళారుల విష ప్రచారంతో రైతులు ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
కరోనా ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో పెద్ద మార్కెట్లు మూసేస్తున్నారని కానీ ఏపీలో కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ఉంటాయని తెలిపారు. క్షేత్ర స్థాయిలో 4వేల రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, మే నాటికి మరో 11 వేల రైతు భరోసా కేంద్రాలు సిద్దం చేస్తామన్నారు. అయితే రైతులు పంటను వేయడానికి సిద్దంగా ఉంటే ఓ పది రోజులు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చేతికొచ్చిన పంటను కొన్ని రోజుల పాటు రైతుల వద్దే ఉంచుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment