ఎస్సీ, బీసీ కాలనీలో గ్రామస్తులతో మాట్లాడుతున్న మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావిత ఐదు గ్రామాల ప్రజలు ఐదు రోజుల తర్వాత మంగళవారం సరికొత్త ఉదయాన్ని చూశారు. సోమవారం రాత్రి వారి మధ్యనే మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బస చేసి కొండంత భరోసా ఇచ్చారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీవీఎంసీతోపాటు అన్ని విభాగాల అధికారులు కంటిమీద కునుకు లేకుండా ఆయా గ్రామాల్లో రాత్రంతా కాపలా కాశారు. సోమవారం రాత్రి ఇళ్లకు చేరుకున్న గ్రామస్తులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నైతిక స్థైర్యం కల్పించారు. ఆ గ్రామాల్లో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రజాప్రతినిధుల నిద్రతో ఆ ప్రాంతాల్లో నవోదయం వెల్లివిరిసింది. ఐదు రోజుల్లోనే గ్రామస్తుల దైనందిన జీవనం యథావిధిగా ప్రారంభమైంది. ఉదయాన్నే చాలామంది నిర్భయంగా మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. కిరాణా, పాలు, కూరగాయలు తదితర షాపులన్నీ తెరుచుకున్నాయి. దినపత్రికలు సరఫరా అయ్యాయి.
గ్రామాల్లో మంత్రుల నిద్ర
ఆ ఐదు గ్రామాల్లో మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్‌ప్రసాద్ సోమవారం రాత్రి బస చేశారు. గ్రామస్తులతో ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. రాత్రి వారితోనే కలిసి భోజనం చేశారు.
గ్రామాల్లో వైద్య శిబిరాలు: కన్నబాబు
వెంకటాపురం: జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు సోమవారం రాత్రి 8 గంటలకు వెంకటాపురం చేరుకున్నారు. గడపగడపకూ తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 11.30 గంటలకు వెంకటాపురంలోనే ఒక ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు లేచి రెడీ అయ్యి మళ్లీ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం అన్నివిధాలా గ్రామస్తులను ఆదుకుంటుందని ధైర్యాన్ని ఇచ్చారు. కాలుష్యం కారణంగా భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొంతమంది ఆందోళన వ్యక్తం చేయగా.. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు శాఖల వైద్యాధికారులు గ్రామాల్లోనే ఉంటారని చెప్పారు. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రాథమిక శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి అవసరమైతే పెద్దాస్పత్రులకు పంపించడం జరుగుతుందన్నారు. కన్నబాబు వెంట మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఉన్నారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: ముత్తంశెట్టి
పద్మనాభనగర్‌లో: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం రాత్రి 8 గంటలకు గ్యాస్ పీడిత గ్రామాలను సందర్శించారు. వెంకటాపురం, పద్మనాభనగర్‌లలో స్థానికులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 10 గంటలకు గ్రామస్తులతో కలిసి భోజనం చేసి పద్మనాభనగర్‌లోని ఒక ఇంట్లోనిద్రించారు. ఉదయం 5.45 గంటలకు లేచి గ్రామంలో తిరిగారు. ఆవులకు పశుగ్రాసం వేశారు. బోర్ వాటర్‌ను పరిశీలించారు. అనంతరం ఇళ్లకు వెళ్లి స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఉన్నారు. 9 గంటలకు మిగిలిన నాలుగు గ్రామాలు కూడా సందర్శించి అక్కడ పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
కంపెనీ మూతపడే ఉంది: బొత్స
నందమూరి నగర్‌లో: మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం రాత్రి 8 గంటలకు నందమూరినగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 6 గంటలకే నిద్రలేచి గ్రామం మొత్తం కలియతిరిగారు. స్థానికుల సమస్యలను సావధానంగా విన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం కంపెనీ మూతపడి ఉందని, కమిటీ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట వీఎంఆర్‌డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా ఉన్నారు.
వెంకటాపురంలో ఎన్యుమరేషన్ తీరును పరిశీలిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
స్టైరీన్ తరలిస్తున్నాం :ధర్మాన
ఎస్సీ, బీసీ కాలనీలో: మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం రాత్రి 9 గంటలకు ఎస్సీ, బీసీ కాలనీకి చేరుకుని ఓ ఇంట్లో బస చేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకే నిద్ర లేచి గ్రామంలోని ప్రతి వీధీ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నిపుణుల సూచనలు ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా స్టైరీన్ గ్యాస్‌ను తరలించేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
గ్రామస్తులతో ఎంపీల మాటామంతి
సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అక్కడే ఒక ఇంట్లో మేడమీద ఆరు బయటే నిద్రించారు. తిరిగి ఉదయం 5.45 గంటలకు లేచారు. గ్రామాల్లో కలియతిరిగారు. వెంకటాపురం, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరి నగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రజలను కలిశారు. వెంకటాపురంలో కొంతమంది తమ సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి నాలుగు ఇళ్లకు ఒక పారిశుధ్య కార్మికుడు నిత్యం పనులు చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ఎంవీవీ సోమవారం రాత్రి 8 గంటలకు కంపరపాలెం గ్రామాన్ని సందర్శించారు. మంత్రులతో కలిసి అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను పర్యవేక్షించారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 10 గంటలకు స్థానికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం 11 గంటలకు ఓ ఇంట్లో నిద్ర చేశారు. ఉదయం 6 గంటలకు రెడీ అయ్యి మళ్లీ అన్ని గ్రామాల్లో కలియతిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment