
సాక్షి, విజయవాడ: కరోనా నియంత్రణ చర్యలపై చర్చించడానికి విజయవాడ ఆర్‌అండ్‌బి కార్యాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. (కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు)
కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం ఐదుగురు మంత్రులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సభ్యులుగా.. మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి బొత్స, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోం శాఖ మంత్రి సుచరిత సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడం, వైరస్ వ్యాప్తి చెందకుండా వివిధ దశల్లో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై సమీక్షిస్తుంది.
కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీని సర్కార్ నియమించింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ వ్యాప్తి నిరోధం, క్వారంటైన్‌లో ఉన్నవారి పర్యవేక్షణ, లాక్‌డౌన్ అమలు వంటివి పటిష్టంగా అమలు చేయడానికి ఈ కమిటీని వేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎస్ నీలం సాహ్ని చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కో చైర్మన్‌గానూ, కన్వీనర్‌గానూ ఉంటారు. సభ్యులుగా డా.పీవీ రమేష్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పౌరసరఫరాలు, మార్కెటింగ్, రవాణా శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, సమాచార పౌరసంబంధాల ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీలు ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment