వరద నీటిలో చిక్కుకున్న కొండ్రుకోట గ్రామానికి గురువారం లాంచీలో వెళ్తున్న మంత్రులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ఉరకలు వేస్తూ సాగుతున్న వేళ.. వరద ముంపుతో రాకపోకలు నిలిచిపోయిన ముంపు గ్రామాలకు ప్రజాప్రతినిధులు లాంచీలో వెళ్లి బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. వరద కారణంగా గత రెండ్రోజులుగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఉప ముఖ్యమంత్రులు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గురువారం పోలవరం నుంచి లాంచీలో తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం వెళ్లి అక్కడి నుంచి అటవీ మార్గంలో గండిపోశమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి మరో బోట్‌లో రెండు గంటలపాటు ప్రయాణం చేసి కొండ్రుకోట గ్రామానికి చేరుకున్నారు. పీహెచ్‌సీలో అన్ని రకాల మందులు, ఇద్దరు వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచుతామని ఆళ్ల నాని బాధితులకు హామీ ఇచ్చారు. మొదటి విడతగా 20 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకేజీ పంచదార, రెండు లీటర్ల కిరోసిన్ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జేసీ ఎం. వేణుగోపాలరెడ్డి, జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment